మనసు ముక్కలైంది.. చితికి చేరువైంది!

209

The bullet news(crime)-ఇద్దరు ఆడపిల్లలు పుట్టినందుకు తన భార్యను వేధించడంతోపాటు..ఆస్తి పంచి ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్న తల్లితండ్రుల వైఖరితో ఓ వ్యక్తి బతుకుపై విరక్తి పెంచుకున్నాడు. అనుబంధాన్ని మరిచిన వారికి చావుతో కనువిప్పు కల్గించాలన్న నిర్ణయానికొచ్చి..భార్యాబిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేడ్చల్‌ జిల్లా కీసరలో మంగళవారం ఈ ఘటన జరిగింది.

ఘట్‌కేసర్‌ మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన మడిపడిగ రమేశ్‌(30) తండ్రితో కలిసి పాల వ్యాపారం చేసేవాడు. ఆయనకు శామీర్‌పేట్‌ మండలం ఉద్దెమర్రి గ్రామానికి చెందిన మానస(22)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గీతశ్రీ(7), దివ్యశ్రీ(6 నెలలు) కుమార్తెలు. భార్యాభర్తలు సఖ్యతగానే ఉంటున్నా..రెండోసారీ ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో అత్తమామలు, ఆడపడుచుల నుంచి ఇటీవల మానసకు వేధింపులు అధికమైనట్టు సమాచారం. దీనికితోడు భూమి విక్రయం ద్వారా వచ్చిన నగదు పంపకం విషయంలో రమేశ్‌కు, తల్లిదండ్రులకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆ సొమ్ము తనకు ఇచ్చేందుకు తల్లిదండ్రులు నిరాకరించడం, భార్యను వేధిస్తుండడం వంటి పరిణామాలతో మనస్తాపానికి గురైన రమేశ్‌ సోమవారం మధ్యాహ్నం భార్య, పిల్లలతో సహా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.                                                                                                                            ఓ యువకుడి మృతదేహం పెద్దమ్మ చెరువులో తేలుతుండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అదే సమయంలో రమేష్‌ కోసం వెతుక్కుంటూ చెరువు కట్ట వద్దకు వచ్చిన బంధువులు.. అక్కడి బండరాయిపై ఆ కుటుంబానికి చెందిన చెప్పులను గుర్తించారు. చెరువులో నాలుగు మృతదేహాలు లభ్యమవడంతో..అందరూ సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మానస చిన్న కుమార్తెను పొదవిపట్టుకునే మరణించి ఉండటాన్ని గుర్తించిన బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ కుటుంబ విషాదాంతంతో కొండాపూర్‌ గ్రామంలో విషాదం అలముకుంది. రెండో కాన్పులోనూ ఆడ పిల్ల పుట్టిందన్న కారణంతో తమ కుమార్తెను అత్తమామ, ఆడపడుచులు వేధింపులకు గురిచేశారని, ఇంతటి విషాదానికి వారే కారణమని మానస తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

SHARE