వాట్సాప్‌ డిజైన్‌తో శుభలేఖ

425

The Bullet News -Viral

ఈ మధ్య వివాహ ఆహ్వాన పత్రికలను వెరైటీగా రూపొందించుకోవడం ఫ్యాషన్‌గా మారింది. గుజరాత్‌లోని ఓ జంట చాలా వెరైటీగా శుభలేఖను తయారు చేసుకున్నారు. ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తరహా డిజైన్‌తో కార్డును రూపొందించారు. సూరత్‌కు చెందిన అర్జూ, చింతన్‌లు వాళ్ల  పెళ్లి కార్డును కొత్తగా ఉండాలని భావించి.. వాట్సాప్‌ డిజైన్‌ను ఎంచుకున్నారు. స్వతహాగా వెబ్‌ డిజైనర్‌ అయిన చింతన్‌ నాలుగు పేజీలతో శుభలేఖను రూపొందించారు. అయితే వాట్సాప్ తరహాలో తయారు చేయాలనే ఐడియా మాత్రం అర్జూ ఇచ్చినట్లు చెప్పారు.

పెళ్లి పత్రిక కవర్‌ పసుపు రంగులో ఉంటుంది. దానిపై ‘అన్‌లాక్‌ ఇన్విటేషన్‌’ అని రాశారు. లోపల కొత్త జంట ఫొటో, దాని కింద స్టేటస్‌లో ‘మీరు తప్పనిసరిగా పెళ్లికి రావాలని, లేదంటే వాట్సాప్‌లో బ్లాక్‌ చేస్తాం’ అని పేర్కొన్నారు. వాట్సాప్‌ లోగో స్థానంలో వినాయకుడి ఫొటో ప్రచురించారు. చింతన్‌కు ఈ కార్డు డిజైన్‌ చేయడానికి వారం రోజులు పట్టిందట.ఈ కొత్త జంట ఐడియాను వాళ్ల తల్లిదండ్రులు కూడా మెచ్చుకున్నారు. వీరి వివాహం ఫిబ్రవరిలో జరగనుంది.