వివాహేత‌ర సంబంధ‌మే హ‌త్య‌కు కార‌ణం.. నాయుడుపేటలో మ‌హిళా హ‌త్య కేసును ఛేదించిన పోలీసులు

264

The bullet news (Naidupeta)_  వివాహేతర సంబంధం మహిళ హత్యకు దారి తీసిందని సీఐ మల్లికార్జునరావు తెలిపారు. మహిళను హత్య చేసి చెట్లలో పడేసిన ఘటనను ఛేదించామని, నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. నాయుడుపేట పోలీసుస్టేషన్‌లో మంగళవారం సీఐ ఈ కేసు వివరాలను వెల్లడించారు. నాయుడుపేట అమరాగార్డెన్‌కు చెందిన భాగ్యలక్ష్మి(40) అనే మహిళ ఈ నెల 14వ తేదీ రాత్రి పిచ్చిరెడ్డితోపులోని నివాసాల నడుమ హత్యకు గురయిందని తెలిపారు. ఆమెకు రెండేళ్లుగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీప కాళంగి ప్రాంతానికి చెందిన రామచంద్రయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడిందన్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారన్నారు. ఇటీవల అతనికి హెచ్‌ఐవీ సోకిందని తెలుసుకుని ఆమెపై వ్యతిరేకత ఏర్పరుచుకున్నాడు. ఈ నెల 14వ తేదీన రామచంద్రయ్య నాయుడుపేటలో ఆమె నివాసముంటున్న అమరాగార్డెన్‌కు చేరుకుని రాత్రి ఇక్కడే ఉండేందుకు ప్రయత్నించాడన్నారు. అందుకు ఆమె తిరస్కరించి తన అక్క నివాసముంటున్న స్థానిక లోతువానిగుంటకు వెళ్లేందుకు రాత్రి 9.30 గంటల సమయంలో బయల్దేరింది. దీంతో అతను తన చేతిలో ఆటో స్టార్ట్‌ చేసే తాడును ఉంచుకుని ఆమె వెంట నడుస్తూ పోవద్దని వారించాడు. ఇద్దరి నడుమ వాగ్వాదం చోటు చేసుకొంది. వీరు స్థానిక పిచ్చిరెడ్డితోపులోని జీసెస్‌ ఫౌండేషన్‌ ఎదురుగా రోడ్డుపైకి చేరుకున్నారు. అక్కడ అతను ఆమెపై దాడి చేసి చేతిలోని తాడుతో చంపేశాడు. మృతదేహాన్ని అక్కడి చెట్లలో వేశాడు. అక్కడి నుంచి సమీప మద్యం దుకాణానికి వెళ్లి తాగి అమరా గార్డెన్‌లోని ఇంటికి చేరుకుని రాత్రి నిద్రించాడు. 15వ తేదీ ఉదయం ఘటనా స్థలానికి ఆటోలో చేరుకుని ఆమె బతికి ఉందా మృతి చెందిందా అని నిర్ధరించుకుని వస్తుండగా పక్కింటి మహిళ చూసి అరిచింది. దీంతో అక్కడి నుంచి హడావుడిగా వచ్చేశాడు. తర్వాత ఘటనా స్థలానికి డీఎస్పీ రాంబాబు, సీఐ మల్లికార్జునరావు, ఎస్సై రవినాయక్‌ బృందం చేరుకుని ఆనవాళ్లు సేకరించి హత్య జరిగిన తీరును ఆరా తీశారు. హత్య చేసిన రామచంద్రయ్య వీఆర్వో శ్రీనివాసులు సమక్షంలో లొంగిపోయి నేరాన్ని చేసినట్లుగా ఒప్పుకొన్నాడని సీఐ తెలిపారు. తనకు ఆమె కారణంగా హెచ్‌ఐవీ వచ్చిందని, ఆమె కూతురును తన మేనల్లుడికి పెళ్లి చేయమంటే తిరస్కరించిందని దీంతో హత్య చేశానని తెలిపాడని సీఐ వివరించారు. ఈ హత్య కేసులో ఇంకా ఎవరి పాత్రైనా ఉంటే దర్యాప్తు చేసి వారిని అరెస్టు చేస్తామన్నారు. ఆయన వెంట ఎస్సై రవి నాయక్‌, సిబ్బంది ఉన్నారు.

SHARE