ఎల్లలు దాటిన అక్షర ప్రతిభ

175

The bullet news(tada)- వారు కార్పొరేటు పాఠశాలల్లో చదవలేదు.కుటుంబ నేపథ్యం చూస్తే కాయకష్టాన్ని నమ్ముకున్న నిరుపేద తల్లిదండ్రులు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. కన్నవారి కష్టాన్ని గుర్తెరిగి ఆబిడ్డలు కష్టపడి చదువుతున్నారు. ఉపాధ్యాయుల పోత్సాహం వారికో గుర్తింపు తీసుకొచ్చింది. అమెరికాలో మే 24 జరిగే అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ప్రసంగించాలంటూ తడ, వెంకటగిరి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో చదివే చెంచు లావణ్య, అశ్వినిల కు ఆహ్వానం వచ్చింది. బస్సు సౌకర్యం కూడా లేని మారుమూల పల్లెలకు చెందిన బాలికలు అదికూడా జిల్లాలో కేవలం ఇద్దరే అంతర్జాతీయ సదస్సుకు ఎంపిక కావడం వెనుక జరిగిన విద్యార్థుల కృషి, పట్టుదల గురించి తెలుసుకోవాలనుందా… అయితే వివరాలు చదవండి.                                                                                                                            తడ కసూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో 9వ తరగతి చదివే మాగర్ల చెంచు లావణ్య చదువులో ప్రతిభ చూపడమే గాకుండా వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లోనూ ఉత్సాహంగా పాల్గొనేది. ఆ ఆసక్తి తనను అమెరికాకు రప్పిస్తుందని ఆబాలిక కలలో కూడా ఊహించలేదు. గతేడాది స్వచ్ఛవిద్యాలయ పేరిట నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జిల్లాస్థాయికి ఎంపికైంది. పక్షుల పండుగ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది.

కుటుంబ నేపథ్యం ఇదీ
సూళ్లూరుపేట మండలం దామరాయి పంచాయతీ కొల్లపట్టు గ్రామానికి చెందిన మాగర్ల సుజాత, చెంచయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె చెంచులావణ్య. వీరిది నిరుపేద కుటుంబం. కేవలం వర్షాధారంపై ఆధారపడి పండే రెండెకరాలను నమ్ముకుని కుటుంబం జీవనం సాగిస్తోంది. గ్రామంలోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1నుంచి 5వరకు చెంచులావణ్య చదువుకుంది. ఆ తరువాత ఉన్నత పాఠశాలలో చేర్పించాలంటే సహకరించని ఆర్థిక స్థోమతతో ఉపాధ్యాయుల సూచనల మేరకు తడలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో ఆరో తరగతిలో తల్లిదండ్రులు చేర్పించారు.

మలుపు తిప్పిన ఇన్‌స్పైర్‌ నమూనా
ఇటీవల జరిగిన జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ పోటీలకు ఎంపికైన  చెంచులావణ్య ప్రదర్శించిన నమూనా అందరి అధికారుల దృష్టిని ఆకర్షించింది. మురుగు నీటిని మంచినీటిగా మార్చే సులువైన విధానం మానవాళికి నిజమైన అవసరంగా పలువురు గుర్తించారు. ప్రయోగ విధానాన్ని ఆమె వివరించిన తీరుకూడా ఆకట్టుకుంది. ఫిజికల్‌ సైన్సు ఉపాధ్యాయిని పద్మావతి సూచనలను తూ.చ తప్పక పాటించింది. ఈనేపథ్యంలో గత నెలలో తిరుపతిలో నాసా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెమినార్‌కు వెళ్లాల్సిందిగా జిల్లా అధికారులు సూచించారు. అంతరిక్షంలో జీవనానికి ఏమేం అవసరం అనే అంశం ఇచ్చారు. అందులో కొందరు గాలి, నీరు ఇలా ఎంపిచేసుకున్నారు.చెంచులావణ్య  మాత్రం ఉష్ణం అనే అంశాన్ని ఎంపికచేసుకుని పేపరు ప్రెజెంటేషన్‌తోపాటు విశదీకరించి వివరించింది. నాసా తరపున సెమినార్‌ నిర్వహించిన హెడ్‌ రఘునందన్‌కు పేపర్‌ ప్రెజెంటేషన్‌ బాగా నచ్చింది. వారం క్రితం చిత్తూరులో నాసా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిక్షణకు ఆహ్వానించారు. అప్పటికప్పుడే ఇచ్చిన సౌరవిద్యుత్తు అనే అంశంపై పేపర్‌ ప్రెజెంటేషన్‌ చక్కగా తయారుచేసి ఇచ్చింది. చెంచులావణ్య ప్రెజెంటేషన్‌ ప్రతిభ గుర్తించిన నాసా అధికారులు అంతర్జాతీయ అంతరిక్ష సదస్సుకు ఎంపికచేశారు.                                                           ఫలించిన గురుత్వా‘కర్షణ’                                                                                                                                                                                వెంకటగిరి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 8 వతరగతి చదువుతున్న వీరపల్లి అశ్విని  గూడూరు పట్టణం గాంధీనగర్‌కు చెందిన వంట మాస్ట్టారు శివ శంకర్‌ ప్రసాద్‌ కుమార్తె. ఈ విద్యార్థిని ఆరో తరగతి నుంచి వెంకటగిరి  పాఠశాలలో చదువుతోంది.ఆంధ్రప్రదేశ్‌ కస్తూర్బా విద్యాలయం ఆదేశాల మేరకు తిరుపతిలో నేషనల్‌ స్పెస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శన కార్యక్రమంలో  గురుత్వాక్షర్షణ విధానాన్ని ప్రదర్శించింది. తొలి విడతగా వెంకటగిరిలో ఎంపిక కావడంతోనే రెండో విడత చిత్తూరులో ప్రదర్శన నిర్వహించారు. ఇక్కడ సౌరశక్తి వినియోగంపై ప్రదర్శన ఇచ్చింది. ఇక్కడా  ఎంపిక కావడంతో గురువారం విజయవాడలో జరగనున్న ప్రదర్శనకు ఎంపికయ్యారు. రెండు విభాగాల్లో ఎంపిక కావడంతో ఆంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లోని నాసా ప్రయోగ కేంద్రంలో మే 24న జరగనున్న అంతర్జాతీయ అంతరిక్ష  సదస్సుకు ఈ విద్యార్థినికి ఆహ్వానం అందింది. అంతరిక్షంలో మార్పులు ,మానవ సంబంధాలు తదితర అంశాలపై  ప్రదర్శన ఇవ్వనున్నారు. పేద కుటుంబం  నుంచి వచ్చిన ఈ విద్యార్థిని అంతర్జాతీయ స్థాయిలోని నాసా కేంద్రంలో జరిగే సదస్సు ఎంపిక కావడం గొప్ప విషయం.  ఈ విద్యార్థిని ఆరో తరగతిలోనే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జిల్లా స్థాయిలో ఎంపిక కావడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికై హైదరాబాదులో అవార్డును అందుకుంది. గతేడాది స్వచ్ఛ విద్యాలయంకు సంబంధించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొని జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి అవార్డు అందుకుంది. ఈ ఏడాది నెల్లూరులో జిల్లా స్థాయిలో నిర్వహించిన సైన్స్‌ఫేర్‌లో కూడా పాల్గొంది. నాసా సదస్సుకు ఎంపికైన ఈ విద్యార్థినులకు భారతదేశంలోని రాకెట్‌ ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటలో కూడా శాస్త్రవేత్తల సమక్షంలో ప్రత్యేక తర్పీదు ఇవ్వనున్నారు.                                                                                                  తొలి విడతలోనే ఈస్థాయికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో అంతరిక్షంలో జరిగే అద్భుతాలు, మానవ జీవన విధానం ,నీటి లభ్యత తదితర అంశాలపై ప్రయోగాలు చేసి వివరాలను ప్రజలకు అందిస్తా. మంచి శాస్త్రవేత్తగా ఎంపిక కావడమే లక్ష్యం.                                                        ఐఏఎస్‌ కావడమే జీవిత లక్ష్యమని చెంచులావణ్య ‘న్యూస్‌టుడే’కు  తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష సదస్సుకు ఎంపిక కావడం నిజంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని వివరించింది. గ్రామాల్లో నివసించే ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించి, వ్యవసాయానికి ఇబ్బందులు తలెత్తకుండా తగు రీతిలో నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచి రైతులను ఆదుకోవాలని తన సంకల్పాన్ని బయటపెట్టింది.

 

SHARE