THE BULLET NEWS (MUTHUKUR)-అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది కూడా. చిన్ననాటి నుంచి ప్రయోజకుడయ్యే వరకు అంబేద్కర్ సవర్ణ హిందువుల నుంచి అంటరానివాడిగా అవమానాలు ఎదుర్కొన్నాడు. గ్లాసుడు నీళ్లు తాగేందుకు, తోటి విద్యార్ధులతో కలిసి చదువుకునేందుకు, రోడ్లపై నడిచేందుకు, ఆలయాల్లోకి ప్రవేశించేందుకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అసమానతలను అంబేద్కర్ భరించాడు. అస్పృశ్యుల దీనస్థితికి హిందూమతం, మనువు ధర్మాలేనని బలంగా విశ్వసించాడు. వేదాలు,ఉపనిషత్తులు,ఇతిహాసాలు చదివి మనువు అసలు రూపాన్ని తెలుసుకున్న అంబేద్కర్ దురదృష్టవశాత్తూ నేను హిందువుగా పుట్టాను.. కానీ హిందువుగా మాత్రం మరణించను అంటూ సంచలన ప్రకటన చేశారు. అన్నట్లుగానే 1956 అక్టోబర్ 14న నాగపూర్‌లో బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధం స్వీకరించారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించినంత కాలం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే జీవించారు. వెలివాడల్లోని దళితులకు సముచిత స్ధానాన్ని కల్పించేందుకు అవిశ్రాంత పోరాటం చేశాడు. తాను నమ్మిన సిద్ధాంతం, తన ప్రతిపాదనలను వైరివర్గానికి సహేతుకంగా వివరించేందుకు నిద్రను త్యాగం చేశాడు. మానవుని కళ్లు విజ్ఞానపు వాకిళ్లని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్ తరాలు చరిత్రను పుక్కిట పట్టాల్సిన అవసరాన్ని తన రచనల్లో నొక్కి చెప్పారు. పీడితవర్గాలు ప్రగతి పథంలో నడవాలంటే కుల, వర్గ దోపిడీ లేని రాజ్యం కావాలని అంబేద్కర్ ఆశించాడు. అయితే పోరాటాల ద్వారానే ఇది సాధ్యపడుతుందని అంబేద్కర్ చెప్పారు. రాజ్యాధికారమే పీడిత, వర్గాల సామాజికాభివృద్ధికి ఏకైక మార్గం, రాజ్యాధికారం లేకుండా దళితుల అభివృద్ధి అసంభవం, అసాధ్యం అని చెప్పిన మహిళల అభివృద్ధి కోసం తపించారు. ప్రతి స్త్రీని శాస్త్ర దాస్యం నుండి విముక్తి చేయాలనే లక్ష్యంతోనే హిందూకోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. అయితే ఆనాటి సనాతన, సాంప్రదాయ అగ్రకుల పాలకులు హిందుకోడ్ బిల్లుకు అడ్డుపడ్డారు. ఆ బిల్లు ఆమోదానికి తోడ్పడని ప్రధాని నెహ్రూ వైఖరికి నిరసనగా కేంద్రమంత్రి పదవికే రాజీనామా చేసిన భారతరత్న అంబేద్కర్.
మనిషికి, మనిషికి మధ్య ఉన్న అసమానత్వమే బాధలన్నింటికి కారణం. అందుకే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ క్రూరత్వం కంటే నీచత్వమే హీనమైనదన్నారు. కులం, మతం పునాదుల మీద ఒక జాతిని కాని ఒక నీతిని కాని నిర్మించలేరనే నిజాన్ని నిర్భయంగా చెప్పారు. అందుకే అంబేడ్కర్ కులరహిత సమాజాన్ని కాంక్షించేవారికి అనుసరణీయుడు.. సదా స్మరణీయుడు.