ఆనంతో బొత్స మంతనాలు

155

The Bullet News ( Nellore)-  ఆత్మకూరు తెదేపా ఇన్‌ఛార్జి ఆనం రామనారాయణరెడ్డి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ రహస్యంగా భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం వారిద్దరి కలయికపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆనం పార్టీ మారతారన్న ప్రచారం గత కొద్ది నెలలుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇటీవల జరిగిన తెదేపా నియోజకవర్గాల మహానాడుల్లో భాగంగా ఆనం పార్టీపై, మరీ ముఖ్యంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లక్ష్యంగా అనేక ఆరోపణలు చేశారు జూన్‌ 2వ తేదీ నుంచి నెల్లూరు నగరంలో వైకాపా పెద్ద ఎత్తున వంచన దీక్ష చేపడుతోంది. ఈ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రధాన, ముఖ్య నాయకులంతా హాజరవుతున్నారు. జగన్‌కూడా వస్తారని పార్టీ వర్గాలు అంటన్నాయి. ఈ క్రమంలో జిల్లాలో ఏర్పాట్లను పరిశీలించేందుకు బొత్స సత్యనారాయణ గురువారం  నగరానికి వచ్చారు. ఆయన రాగానే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, నాయకులు, ఎవర్నీ కలవకుండా ముందుగా సంతపేటలోని ఆనం రామనారాయణరెడ్డి ఇంటికి నేరుగా వెళ్లారు. సుమారు గంటన్నర పాటు రహస్యంగా మంతనాలు జరిపారు. ఈవిషయాన్ని ఎవరికీ తెలియనీయకుండా ఉంచారు. వారి భేటీ అనంతరం బొత్స వైసీపీ నాయకులను కలిశారు. ‘ఈ రహస్య చర్చ దేనికి సంకేతం’ అనే సందేహం వ్యక్తం అవుతోంది. ఆనం దాదాపు పార్టీ మారడం ఖాయం అయ్యిందని, ఇక లాంఛనంగా జగన్‌ సమక్షంలో చేరడమే తరువాయి అనే ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆనం, బొత్సాలు కలుసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతనెలలో ఆనం వివేకానందరెడ్డి మృతిచెందినప్పుడు బొత్స  పరామర్శకు వచ్చారు. ఆ సమయంలో రామనారాయణరెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్లారు. ఇప్పుడు ఎలాంటి సందర్భం లేకున్నా, ప్రత్యేకంగా వారే కలుసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ఆనం కుటుంబం పార్టీ మారడంపై బద్వేల్‌ కేంద్రంగా వైకాపా ముఖ్యనేతలతో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో రామనారాయణరెడ్డి స్వయంగా నోరు మెదిపితే తప్ప వాస్తవాలు తెలియరావు.

SHARE