ఆంధ్రప్రదేశ్‌కు ‘చంద్ర’గ్రహణం పట్టింది

199

The bullet news (Gudur)- దుగ్గరాజపట్నం పోర్టు వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారని, ఆంధ్రప్రదేశ్‌కు ‘చంద్ర’గ్రహణం పట్టిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన గూడురు కోర్టు సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

‘అన్నా నీకు తోడుగా ఉన్నామంటూ అడుగులో అడుగు వేస్తూ వస్తున్నారు. ఆత్మీయతను చూపిస్తున్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు ప్రతి తాతకు, ప్రతి సోదరునికి ప్రతి స్నేహితునికి ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గూడురు నియోజకవర్గంలో నడుస్తున్నప్పుడు నా దగ్గరకు చాలా మంది వచ్చారు. పెద్ద చదువులు చదువుకున్నా.. చేయడానికి ఉద్యోగాలు లేవన్నా.. అని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నా దగ్గర్లో దుగ్గరాజపట్నం ఉందన్నా.. విభజన చట్టంలో దుగ్గరాజపట్నం పోర్టును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2018 కల్లా పోర్టు తొలిదశను పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, బాబు అధికారంలోకి వచ్చాక దుగ్గరాజపట్నం పోర్టుకు బదులు వేరేది ఏదైనా ఇస్తే బావుంటుందని కేంద్రానికి లేఖ రాశారని ఆవేదన చెందారు. చంద్రబాబు ఎవరన్నా మా దుగ్గరాజపట్నం పోర్టును వద్దనడానికి? ఆయన ఎవరన్నా ప్రత్యేక హోదా వద్దు అని చెప్పడానికి? అని ప్రశ్నించారు.

నెల్లూరు జిల్లా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. రాష్ట్రానికి ‘చంద్ర’గ్రహణం పట్టింది. కృష్ణపట్నం పోర్టును చూస్తే మనందరికీ వైఎస్‌ఆర్‌ గుర్తొస్తారు. తొమ్మిదేళ్లలో బాబు చేయలేదని కేవలం ఐదేళ్లలో వైఎస్‌ఆర్‌ చేసి చూపించారు. కృష్ణపట్నం పోర్టును కట్టించారు. స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూశారు. ఆయన పోయిన తర్వాత మళ్లీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇదే గూడురు మున్సిపాలిటీలో మంచినీటికి కటకటలాడాల్సిన పరిస్థితి. కండలేరు నుంచి గూడురు పట్టణానికి వైఎస్‌ఆర్‌ మంచినీరు అందించారు. ఆ పైపులైన్ల ద్వారా మంచినీరు ఇవ్వలేని పరిస్థితిలో బాబు ప్రభుత్వం ఉంది.

ఇదే గూడురులో ఫ్లై ఓవర్‌ పాత, కొత్త టౌన్లను కలుపుతుంది. ఆ ప్రాజెక్టును సగభాగం వైఎస్‌ఆర్‌ పూర్తి చేశారు. బాబు గద్దెనెక్కాక ఆ ఫ్లై ఓవర్‌ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే గూడురు నియోజకవర్గంలో నిమ్మపంట అధికంగా వేస్తారు. దాదాపు 40 వేల ఎకరాల్లో నిమ్మపంట వేస్తున్న రైతుల బాధలు వర్ణనాతీతం. 80 కేజీల నిమ్మకాయలు 500లకు కొనుగోలు చేస్తున్నారు. మేం ఎలా బ్రతకాలి? అని రైతులు అడుగుతున్నారు. సరుగుడు పంట రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది.

SHARE