గంటి ప్రసాదం హత్యపై న్యాయవిచారణ జరిపించాలి

94

The bullet news (Nellore)-  విప్లవ రచయితల సంఘం నాయకులు గంటి ప్రసాదం హత్యపై న్యాయవిచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘ నాయ‌కులు ఎల్లంకి వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్ చేశారు.. నెల్లూరు ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న ఆసుపత్రి సమీపంలో గంటి ప్రసాదంను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేసి ఇప్పటికి ఐదేళ్లు గడిచిపోయిందన్నారు. హంతకులు ఎంతటివారైనా త్వరలోనే అరెస్టు చేసి చట్టం ముందు నిలబెడతామన్న పోలీసు అధికారుల ప్రకటనలు అలానే మిగిలిపోయాయని..ఇంతవరకు హంతకులు ఎవరో తేల్చలేదని విమర్శించారు. అప్పటి నుంచి మొత్తం వ్యవహారం చూస్తే ఈ హత్య ప్రభుత్వం, పోలీసులు చేసిందనే అనుమానాలకు బలం చేకూరుస్తోందన్నారు. గతంలో పౌరహక్కుల సంఘం నాయకులు రామనాధం, పురుషోత్తం, ఆజం అలీ, కెఎన్‌పీఎస్‌ నాయకులు మన్నెం ప్రసాదలను కూడా ఇదే తరహాలో హత్యచేసి ఛత్తీస్‌ఘడ్‌ చిరుతలు, నల్లమల నల్లత్రాచులు, గ్రీన్‌టైగర్స్‌, కోబ్రాస్‌ పేర్లతో లేఖలు విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ చిరుతలు, త్రాచులు ఎవరో ఇంతవరకు పోలీసులు, ప్రభుత్వం తేల్చలేదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రసాదం హత్యపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు ఎన్‌. కేశవులు, విరసం కన్వీనర్‌ పి. కోటయ్య, సీఎల్‌సీ సహాయ కార్యదర్శి సుబ్బారావు, శీనయ్య, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.

SHARE