‘ఏపీకి కేంద్ర సాయం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన హరిబాబు…

15

THE BULLET NEWS (VIJAYAWADA)-ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అడిగింది బీజేపీనే అని ఆ పార్టీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. అసెంబ్లీ వేదికగా బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. ఏపికి కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంపై బుక్ లెట్ విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి హోదా అడిగింది బీజేపీనేనని, హోదాతో కలిగే ప్రయోజనాల్నీ నిధుల రూపంలో ఇస్తున్నామని చెప్పారు. హోదావల్ల వచ్చే ప్రయోజనం దాదాపు 16 వేల కోట్ల రూపాయాలు ఉంటుందని, అందులో భాగంగానే ఇప్పటికే ఏపీకి 9 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించారని, దీనిపై అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేసినట్లు గుర్తుచేశారు. అయితే ఆయన ఎందుకు యూటర్న్ తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. పైగా కేంద్రం దగా చేసిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. నరేగా కింద 3 వేల కోట్లు ఏపీకి విడుదల చేసింది నిజం కాదా అని చంద్రబాబును హరిబాబు ప్రశ్నించారు. పలు కేంద్ర పథకాల కింద 2017-18లో 17,500 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని వెల్లడించారు.

చంద్రబాబు సింగపూర్ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని నిందించడాన్ని ఆయన తప్పుపట్టారు. విదేశీగడ్డపై ప్రధానిపై విమర్శలు చేసిన సంప్రదాయం ఇప్పటివరకూ లేదన్నారు. ఈ నెల 20న చంద్రబాబు దీక్ష చేస్తాననడంలో ఆంతర్యమేమిటని హరిబాబు ప్రశ్నించారు.

SHARE