వర్ల రామయ్య కి మొండి చేయి.. అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం

145

THE BULLET NEWS (AMARAVATHI)-తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో తన అభ్యర్థులను ఖరారు చేసింది. రాజ్య సభ సభ్యుడిగా పదవీకాలం ముగుస్తున్నందున సీఎం రమేష్ కు మరో దఫా అవకాశం కల్పించింది. ఆయనతోపాటు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్ కు అవకాశం దక్కింది. సీనియర్ నేత మాదిగ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య పేరు చివరిదాకా వినిపించినా అనూహ్యంగా కనకమేడల రవీంద్రకుమార్ తెరపైకి వచ్చారు. ఏపీలో బలాబలాలు చూస్తే ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండు తెలుగుదేశం పార్టీకి దక్కుతాయి. వైసీపీ ఒక స్థానంలో గెలుస్తుంది. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేశారు. చివరి వరకూ అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నామినేషన్ దాఖలుకు ఒక్కరోజు ముందు అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తం ముగ్గురు అభ్యర్థులే బరిలో ఉంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. తెలుగుదేశం పార్టీ తరపున బరిలో ఉన్నసీఎం రమేష్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం పూర్తవుతుండగా ఇప్పుడు మరో అవకాశం ఆయనకు లభించినట్లయింది. ఇక కనకమేడల రవీంద్ర కుమార్ ప్రస్తుతం టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు అనుకోకుండా ఈసారి అవకాశం దక్కింది.

SHARE