అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్యాయత్నం

86

The bullet news (Kavali)_ కావలిలోని వీఎస్‌యూ పీజీ సెంటర్‌లో డిపార్ట్‌మెంట్‌ ఓఎస్డీ వేధింపులు తట్టుకోలేక మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఈఘటన సోమవారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. వైఎస్సార్‌ జిల్లా కడప పట్టణానికి చెందిన మీసాల సుశీల 2013 నుంచి కావలిలోని విక్రమ సింహపురి పీజీ సెంటర్‌లో జువాలజీ విభాగంలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తోంది. రెండున్నరేళ్ల క్రితం జువాలజీ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ వి.శైలజను జువాలజీ హెచ్‌ఓడీగా నియమించారు. ఆమెకు రెండేళ్ల పాటు బాధ్యతలు అప్పగించగా కాలపరిమితి పూర్తయి 6 నెలలు గడిచింది. శైలజ తర్వాత హెచ్‌ఓడీగా నియమితులయ్యేందుకు సుశీలకు అన్ని అర్హతలు ఉండటంతో ఆమెను హెచ్‌ఓడీ కాకుండా ఉద్దేశ పూర్వకంగా అడ్డుకుంటుందని ఆరోపించారు.

దీంతో పాటు తనకు డిపార్ట్‌మెంట్‌ పరంగా రావాల్సిన సౌకర్యాలను సైతం రాకుండా అడ్డుకుందని, శైలజ భర్త సుబ్రహ్మణ్యంనాయుడు యూనివర్సిటీ ఈసీ మెంబర్‌ కావడంతో పైఅధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. హెచ్‌ఓడీకి మద్దతుగా వీసీ వీరయ్య, మాజీ రిజిష్ట్రార్‌ శివశంకర్‌  వ్యవహరిస్తున్నారన్నారు.  ఈ పరిస్థితులతో విసిగిపోయిన సుశీల సోమవారం సూసైడ్‌ నోట్‌గా రాసి  సహధ్యాపకుడికి పంపించింది. అనంతరం డిపార్ట్‌మెంట్‌ ఆఫీస్‌ రూంలో విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో సహోద్యోగులు ఆమెను 108 వాహనంలో ప్రభుత్వ ఏరి యా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ ఎస్సై ఎస్‌.వెంకటేశ్వరరాజు  ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.

SHARE