The bullet news :-  తెలంగాణ ప్రజల అస్థిత్వానికి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ మన సంస్క్కుతి పునరుజ్జీవనానికి దర్పణం. ప్రకృతి పరవళ్లు తొక్కే సమయాన భాద్రపద బహుళ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ద దశమి వరకు జగన్మాతగౌరీ దేవీగా పూజిస్తూ ఊయ్యాలూపే పాటల పల్లవుల్లో ఆడపడుచుల ఆర్బాటపు పండగే ఈ సద్దుల బతుకమ్మ.తెలంగాణకే ప్రత్యేకమైన ఈ పూల పండుగ ఈ రోజు నుంచి మొదలవుతుంది.ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే ఈ వేడుకలు తొమ్మిదిరోజులపాటు కొనసాగనున్నాయి.బతుకమ్మకు ఒక్కోరోజు పెట్టే నైవేద్యాన్నిబట్టి ఒక్కో పేరుతో పిలుస్తారు.బతుకమ్మసంబరాలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండగకు ఉన్నంత ప్రాధాన్యత మరే పండగకు లేదని చెప్పవచ్చు. ప్రకృతి ఓడిలో పుట్టి పెరిగే జానపదుల ఆచారాలు, సాంప్రదాయాలు ప్రతిభింభించే పండుగ బతుకమ్మ పండగ. ఇది స్వచ్చమైన మానవ వికాసాన్ని, హృదయభావుకతలను తెలియజేస్తుంది. వినాయక చవితి లేదా బాద్రపద బహుళ పంచమి మొదలుకొని మహాళయ అమావాస్య వరకు బొడ్డెమ్మ పండగ జరుపుకుంటారు. మహాలయ అమావాస్యతో ప్రారంభమై అశ్వయుజ శుద్ద పాడ్యమి నుంచి మహార్ణవమి వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. తెలంగాణలో భాద్రపద బహుళ పంచమి నాటికి మెట్టపంటలన్నీ ఇళ్లకు చేరుతాయి. ధాన్యలక్ష్మి ఇంట్లో కళకలలాడుతూ ఉంటుంది. గ్రామాల్లో యువతులు, స్త్రీలు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు.. కన్నెపిల్లల బొడ్డెమ్మ పండగ నుంచి మొదలై పిల్ల బతుకమ్మ నుంచి బతుకమ్మ పండుగ వరకు బాలికలు, యువతులు, మహిళలు, వృద్దులు ఇలా అన్ని వర్గాల వారు పేద, ధనిక అనే తేడా లేకుండా ఇష్టంగా ఆనందోత్సాహాల మధ్య ఆడుకునే పండగే బతుకమ్మ. ఇక తెలంగాణ మహిళల జీవనానికి ప్రతిభింభంగా నిలిచే బతుకమ్మకు అనేక ప్రాచీన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

19వ శతాబద్దం చివరి 20 వ శతాబద్దం ఆరంభంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కరువు, కాటకాలు, భయంకర వ్యాధులు ప్రభలి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈనేపథ్యంలో.. కరువు, కాటకాలు, అంటు రోగాలు, తుఫాను, భూకంపం మొదలైన ప్రక్రుతి భీభత్సాలను ఎదుర్కోవడానికి గ్రామ ప్రజలకు దేవతలను కొలిచే అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమ బతుకు చల్లగా సాగాలని తమ బిడ్డలు వ్యాధులకు గురై మరణించకుండా ఆరోగ్యంగా ఉండాలనే కొరికల నుంచి ప్రక్రుతి ఆరాధకులైన జానపదులు.. బతుకమ్మ అనే దేవతను సృష్టించుకన్నారు. ఈ బతుకమ్మను ప్రాణప్రదాతగా భావిస్తూ రకరకాల పూలను దేవతలుగా కొలుస్తూ పూజించడమే బతుకమ్మపండుగ. అన్ని పండగలలో దేవతలను పూలతో పూజిస్తే… బతుకమ్మ పండగ సందర్భంగా పువ్వులను ప్రక్రుతి దేవతలుగా పూజిస్తారు. ఇదే బతుకమ్మ పండగ విశిష్టత.

ఇలా పిత్రుఅమావాస్య నుంచి మొదలయ్యే బతుకమ్మ పండగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. బొడ్డెమ్మను నిమజ్జనం చేసే చివరి రోజే బతుకమ్మ పండుగ మొదటి రోజు. ఈ మొదటి రోజు పండుగనే ఎంగిలి పువ్వు పండగ అంటారు. మొదటి రోజు బతుకమ్మ పెద్దగానే ఉంటుంది. మిగితా రోజులలో మామూలుగా పేరుస్తారు. మళ్లీ చివరి రోజు మాత్రం పోటీలు పడి ఇంకా పెద్దగా పేరుస్తారు. స్త్రీ, పురుషులలో ఎవరికి ఎక్కువగా ఆసక్తి, నైపుణ్యం ఉంటే వారే బతుకమ్మను పేరుస్తారు.

బతుకమ్మను వెదురు సిబ్బిలో గానీ.. ఇత్తడి పళ్లెంలోగాని పేరుస్తారు. మొదట గుమ్మడి ఆకులను పరిచి ఆ ఆకులు పల్లెం అంచుకంటే ఎక్కువగా ఉండే విధంగా అమరుస్తారు. గుమ్మడి ఆకుల మధ్య గుమ్మడి పూల రెక్కలు విడదీసి పరుస్తారు. మొదటి వరుస గుడ్రంగా తంగేడు పూలతో పేరుస్తారు. తరువాత తెల్లని గునుగుపూలతో ఒక వరుస పేరుస్తారు. మధ్యలో ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో తంగేడు ఆకులు మొగ్గలు నింపుతారు. కొందరు బతుకమ్మ మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు గునుగుపూలకే రంగులు అద్ది వరుస క్రమంలో అందంగా పేరుస్తారు. పైకి పోయేకొద్ది ఆ వరుసలను గోపురంగా ఉండేట్టు తీర్చుతారు. ఆ తరువాత గన్నేరు, రుద్రాక్ష, కట్ల, బంతి, చేమంతి, బీర, కాకర మొదలైన రకరకాల పూలతో వరుసగా పెద్దగా బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మను పేర్చడంలో పోటీలు పడి తమ కళా కౌశలన్నంతటిని ప్రదర్శిస్తారు. ఎత్తుగా పేర్చి బతుకమ్మ శిఖర భాగాన ఒక పెద్ద అందమైన పుష్ఫం ఉంచుతారు. పెద్ద బతుకమ్మను పేర్చిన తరువాత మరో పళ్లెంలో చిన్న బతుకమ్మను కూడా పేర్చుతారు. చిన్న బతుకమ్మ పైభాగాన పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఈ బతుకమ్మలను పేర్చిన తరువాత వాటిని పూజా గృహంలో కానీ, ఇంటిలో ఓ మూలనైనా కానీ ముగ్గులతో అలికి అగరువత్తులు వెలిగించి ఓ పీటపై అమర్చుతారు.

సాయంత్రం వేళ కొత్త బట్టలు, నగలు, పూలు ధరించినటువంటి పిల్లలు, యువతులు, మహిళలు, వృద్దులు ఒక్కోక్కరుగా బయటకు వెళ్లి ఆ వీధిలోని అందరి కోసంకొంచెం సేపు ఆగి గుంపులు, గుంపులుగా నడుచుటకుంటూ చెరువుల వద్దకు చేకుంటారు. చెరువు గట్టుకు ఓ వెంపలి కొమ్మను నాటి పసుపు కుంకుమలు చల్లి దానిచుట్టూ బతుకమ్మలను దింపుతారు. ఆ తరువాత తమతో తెచ్చుకున్న విడిపూలను బతుకమ్మలపై ఒక్కోటిగా వేస్తూ… ఒక్కొక్క పువ్వేసి చందమామా… ఒక్క జాము అయే చందమామ… శివుడింకరాడాయే చందమామా… శివుని పూజలాయే చందమామా… అంటూ పాడుకుంటారు. ఈ బతుకమ్మ ఆటలో ముఖ్యంగా మత్తయిదువలే పాల్గొంటారు. ఈ విధంగా పది సార్లు బతుకమ్మపై పూలు వేసుకుంటూ శివుణ్ని ప్రార్థిస్తారు. ఆ తరువాత అందరూ కలిసి చెరువు వద్దకు వెళ్లి ఆ నిటిలో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసే ముందు ఎంతో భాదతో తెలంగాణ బతుకు చిత్రాన్ని తెలియజేసే పాటలను పాడుతూ పోయిరా బతుకమ్మ పోయిరా అంటూ బతుకమ్మలను సాగనంపుతూ నిమజ్జనం చేస్తారు.

SHARE