జగన్ ని సైలెంట్ దెబ్బ కొడుతున్న సీఎం చంద్రబాబు

163

The bullet news ( Political) – రాజ‌కీయాల్లో ఎత్తులు పై ఎత్తులు కామ‌న్‌!  త‌ల‌త‌న్నేవాడుంటే.. తాడిత‌న్నేవాడు మ‌రొక‌డుంటాడ‌నేది కూడా రాజ‌కీయాల నుంచి పుట్టిన సామెతే! ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఉందంటే.. రాష్ట్రంలో గ‌త ఏడెనెమిది నెల‌లుగా అధికార‌, విప‌క్షాల మ‌ధ్య ప‌డుతున్న  ఎత్త‌లు, పై ఎత్తుల‌ను చ‌ర్చించేందుకే! రాష్ట్రంలో 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాస్త తేడాతో వైసీపీ అధినేత జ‌గ‌న్ అధికారానికి దూర‌మ‌య్యారు. అయితే, తాను అధికారంలోకి రావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న అప్ప‌టి నుంచి చేస్తూనే వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీపై విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌భుత్వం ఏప‌ని చేప‌ట్టినా అందులోని కీల‌క లొసుగులు క‌నిపెట్టి త‌న మీడియా ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌ని సంక‌ల్పం చేసుకున్న జ‌గ‌న్‌.. ఆదిశ‌గా కూడా బ‌ల‌మైన అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన వైసీపీ ప్లీన‌రీలో త‌న వ్యూహాన్ని వెల్ల‌డించారు. అన్ని సామాజిక వ‌ర్గాల‌కూ చేరువ అయ్యేలా ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించాడు. ముఖ్యంగా వైఎస్సార్ కుటుంబం, న‌వ‌ర‌త్నాలు పేరుతో పెద్ద ఎత్తున ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. ఒక్కొక్క ప‌థ‌కాన్నీ కూలంక‌షంగా కూడా వివ‌రించారు. అన్ని వ‌ర్గాల‌కూ వైసీపీ అండ‌గా నిలుస్తుంద‌ని చెప్పారు. ఇక‌, ఇదిలావుంచి.. న‌వంబ‌రు 6న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. దాదాపు 3000 కిలో మీట‌ర్ల దూరం ల‌క్ష్యంగా ఆయ‌న దీనిని ప్రారంభించారు. క‌డ‌ప జిల్లా ఇడుపుల పాయ‌లో ప్రారంభించిన పాద‌యాత్ర ఇచ్ఛా పురం వ‌ర‌కు సాగేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ పాద‌యాత్ర ద్వారా గ్రామ గ్రామానా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే త‌న పాద‌యాత్ర‌లో హామీల వ‌ర్షం కురిపిస్తున్నారు. విద్యార్థులు, మ‌హిళ‌లు, చేనేత కార్మికులు, రైతులు ఇలా అన్ని సామాజిక వ‌ర్గాల‌కు అభ‌యం ఇస్తున్నారు. బాబు పాల‌న‌పై నిప్పులు చెరుగుతున్నారు. త‌న‌ను గెలిపించాల‌ని ప్ర‌తి ఒక్క‌రినీ అభ్య‌ర్థిస్తున్నారు. తాను గెలిస్తే.. వైఎస్ పాల‌న‌ను తిరిగి అందిస్తాన‌ని కూడా హామీ ఇస్తున్నాడు. ఇక‌, జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఇదిలావుంటే, అప‌ర‌చాణిక్యుడిగా రాజకీయాల్లో పేరు తెచ్చుకుని తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ అధినేత‌, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు.. కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి మ‌రోసారి.. మ‌రోసారి ఇలా.. క‌నీసం 30 ఏళ్ల‌యినా అధికారంలోనే ఉండిపోవాల‌ని ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. పాద‌యాత్ర‌తో జ‌నాల‌కు ద‌గ్గ‌ర‌వుతున్న విప‌క్ష నేత జ‌గ‌న్ ను చూసి ఊరుకుంటారా?  త‌న‌కు ఎస‌రు పెడుతుంటే నోట్లో వేలేసుకుంటారా? అలా అయితే, ఆయ‌న చంద్ర‌బాబు ఎలా అవుతారు?! ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌కు ఎర్త్ పెట్టేలా.. చాప కింద నీరులా.. జ‌గ‌న్‌కు ఎస‌రు పెడుతూ.. బాబు త‌న ప‌క్కా వ్యూహాన్ని ఇప్ప‌టినుంచే అమ‌లు చేసేస్తున్నారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర స‌హా ప్లీన‌రీలో ఏయే వ‌ర్గాల‌కు ఎలాంటి హామీల‌ను ఇచ్చారో స్ప‌ష్టంగా తెలుసుకుని, వాటిపై అధ్య‌య‌నం కూడా చేసిన బాబు.. ఒక్కొక్క‌టిగా వాటిని తానే అమ‌ల్లో పెట్టేస్తున్నారు. బీసీల‌కు ల‌క్ష కోట్ల కేటాయింపులు ప్ర‌క‌టించారు. కాపుల‌కు 5% రిజ‌ర్వేష‌న్ ప్ర‌క‌టించారు. అన్ని సామాజ‌కి వ‌ర్గాల‌కు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేశారు. ఇక‌, జ‌గ‌న్ పాద‌యాత్ర ద్వారా గ్రామాల్లోకి వెళ్తుంటే.. ఇంటింటికీ తెలుగు దేశం పేరుతో చంద్ర‌బాబు త‌న బృంందాన్ని కూడా రంగంలోకి దింపారు. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. చంద్ర‌బాబు సైతం జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వివ‌రిస్తున్నారు. అడిగిన వారికి అడిగిన‌ట్టు పింఛ‌న్లు, రేష‌న్ కార్డులు ఇచ్చేస్తున్నారు. ఇళ్ల విష‌యంపై కూడా పెద్ద ఎత్తున ద‌ర‌ఖాస్తులు తీసుకుంటున్నారు. జ‌గ‌న్ ఎప్పుడో వ‌చ్చిప‌రిష్క‌రిస్తాన‌ని చెబుతున్న స‌మ‌స్య‌ల‌ను బాబు చిటికెలో ప‌రిష్క‌రించి క్రెడిట్ కొట్టేస్తున్నారు. ఇక‌,  జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు మీడియా పెద్ద‌గా హైలెట్ చేయ‌కుండా కూడా తెర‌చాటు చ‌క్రం తిప్పుతున్నారు. ప్ర‌తిరోజూ ప‌త్రిక‌ల్లో త‌న వార్త లేదా ప్ర‌భుత్వ వార్త ప్ర‌ధానంగా వ‌చ్చేలా కూడా చూసుకుంటూ జ‌గ‌న్‌కు ఎర్త్ మీద ఎర్త్ పెడుతున్నారు. సో.. మ‌రి ఈ విష‌యాన్ని జ‌గ‌న్ తెలుసుకుంటున్నాడా?  లేడా?  అనేదే సందేహం!!

SHARE