ఐపీఎల్‌ ఫైనల్స్‌లో కింగ్స్‌…

132

THE BULLET NEWS (MUMBAI)-ఐపీఎల్‌-11వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ముంబైలోని వాంఖడె స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 140 స్వల్ప లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చెన్నై ఛేదించింది. ఓపెనర్‌ డుప్లెసిస్‌(67 నాటౌట్‌; 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించి ఉత్కంఠ పోరులో చెన్నైను గెలిపించాడు. ఓపెనర్‌ షేన్‌వాట్సన్‌ డకౌట్‌గా తొలి వికెట్‌ రూపంలో పెవిలియన్‌ చేరగా, సురేశ్‌ రైనా(22), అంబటి రాయుడు(0) వెనువెంటనే నిష్క్రమించారు. 24 పరుగులకే 3 వికెట్లు కోల్పయిన చెన్నైను ఆదుకుంటాడనుకున్న ధోనీ కూడా 9 పరుగలకే పెవిలియన్‌కు చేరాడు. బ్రావో(7), జడేజా(3) కూడా నిరాశపరచడంతో చెన్నై ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో డుప్లెసిస్‌ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. వికెట్లు పడుతున్నా బాధ్యతాయుతంగా ఆడి జట్టును గెలిపించాడు. ఆఖరి 3 ఓవర్లో విజయానికి 43 పరుగులు అవసరమైన తరుణంలో డుప్లెసిస్‌ ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్‌ తొలి బంతిని సిక్స్‌ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు. ఠాకూర్‌(15 నాటౌట్‌; 5బంతుల్లో 3 ఫోర్లు) డుప్లెసిస్‌కు సహకారం అందించాడు.
అంతకముందు సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌లో తొలి బంతికే శిఖర్‌ ధావన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత విలియమ్సన్‌తో కలిసి 34 పరుగులు జత చేసిన గోస్వామి(12) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మరో రెండు పరుగుల వ్యవధిలో కేన్‌ విలియమ్సన్‌(24) కూడా ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న షకీబ్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. 12 ఓవర్లో మనీశ్ పాండే(8), 14 ఓవర్లో యూసఫ్‌ పఠాన్‌ పెవిలియన్‌ బాట పట్టారు. ఆ తర్వాత బ్రాత్‌వైట్‌ 29 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సుల సహాయంతో 43 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రావో 2, చాహర్, ఎంగిడి, ఠాకూర్, జడేజా తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్‌.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడనుంది.

SHARE