నెల్లూరు లో చిట్ట చీకట్లో పోస్టాఫీస్ పరిసర ప్రాంతాలు…

84

✍షేక్ అస్లాం ✍ నెల్లూరు నగరంలోని ఏకే నగర్ పోస్టాఫీస్ పరిసర ప్రాంతాలు గత నెల రోజులుగా చిట్ట చీకట్లు అలుముకున్నాయి. విద్యుత్, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో పరిసర ప్రాంతాల్లోని వీధి లైట్లు వెలగడం లేదు. ఈ లైట్లకి వచ్చే ప్రధాన లైన్ నెలరోజుల క్రితం కట్ అయినట్లు సమాచారం. అప్పటి నుంచి స్థానికులు అటు విద్యుత్, ఇటు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదు. ఈ ప్రాంతంలో గత ఆరు నెలల్లో నాలుగైదు దొంగతనాలు జరిగాయి. మహిళల మెడలో గొలుసులు లాక్కెళ్లారు. మందుబాబులకు ఈ ప్రాంతం కేరాఫ్ గా మారింది. లైట్లు లేకపోవడంతో చీకటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఒకరోజు, రెండు రోజులు అయితే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఏకంగా నెల రోజుల నుంచి వీధి దీపాలు వెలగకపోవడం దారుణమని స్థానికులు అంటున్నారు. విద్యుత్, కార్పొరేషన్, పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించాలని కోరుతున్నారు. వీధి దీపాలు వెలగకపోతే దొంగతనాలు జరిగే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందిస్తుందా లేదా చూడాలి.

SHARE