చిన్నారి నరబలి కేసును ఛేదించిన పోలీసులు

89

The bullet news(hyderabad)-

ఉప్పల్‌లో సంచలనం సృష్టించిన చిన్నారి నరబలి కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం..
ఉప్పల్‌లో నివాసం ఉండే రాజశేఖర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. ఆ విషయం తెలుసుకున్న ఓ పూజారి ‘చంద్రగ్రహణం రోజున నరబలి ఇస్తే నీ భార్య ఆరోగ్యం బాగుపడుతుంది’ అని రాజశేఖర్‌తో నమ్మబలికాడు. అసలేం ఆలోచించకుండా ఆ పూజారి మాటలను గుడ్డిగా నమ్మిన రాజశేఖర్ అందుకు అంగీకరించాడు. ఓ ముఠా సభ్యుల ద్వారా కరీంనగర్ తాండా నుంచి ఓ చిన్నారిని తీసుకొచ్చాడు. చంద్రగ్రహణం రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంటి మేడపై క్షుద్రపూజలు నిర్వహించి చిన్నారిని బలిచ్చారు. అయితే మొండాన్ని మాయం చేసి తలను డాబా మీదే వదిలేశారు.
ఉదయాన్నే డాబా మీదకు వెళ్లిన పక్కింటి వాళ్లకు చిన్నారి తల కనపడడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు పాప తలను పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేసి ఏ ఇంటి మీద అయితే చిన్నారి తల దొరికిందో ఆ ఇంటి యజమానే ప్రధాన నిందితుడు అని తేల్చారు. తన భార్య ఆరోగ్యం బాగుపడుతుందని పూజారి నమ్మించడంతో నరబలి ఇచ్చానని నిందితుడు కూడా పోలీసుల ముందు అంగీకరించాడు. ఈ కేసులో రాజశేఖర్‌తో పాటు పూజారి, చిన్నారిని విక్రయించిన ముఠా సభ్యులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
SHARE