కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31 అర్ధరాత్రి పోలీసులు ప్రతి చోట పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాగి ఎవరైనా వాహనం నడిపితే, వారిపై కేసు నమోదు చేయడంతోపాటు, భారీ జరిమానాను విధిస్తారు. అంతేకాక వారికి కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. అయితే, మద్యం సేవించిన వారు ఇళ్లకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.అయినా, చాలా మంది దీన్ని పెడచెవిన పెట్టుకున్నారు. ఎందుకంటే, 31 అర్ధరాత్రి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడ్డ వారిపై నమోదు చేసిన కేసుల సంఖ్య చూస్తే ఇది స్పష్టమవుతోంది. నిజానికి ఆ సంఖ్య చూస్తే ఆశ్చర్యమేస్తుంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి 239 చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇక్కడ మద్యం సేవించి పట్టుబడ్డ వారి సంఖ్యను పోలీసులు విడుదల చేశారు. మద్యం సేవించి వాహనాల నడిపినట్లుగా 3,148 మందిపై కేసు నమోదు చేశారు.

SHARE