నకిలీ అపోలో ఫార్మసీ వెబ్ సైట్లు -ఇద్దరు నైజీరియన్లు అరెస్టు

102

THE BULLET NEWS (HYDERABAD)-అపోలో గ్రూపు సంస్థలకు చెందిన అపోలో ఫార్మసీ పేరిట నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి రూ.కోట్లు స్వాహా చేసిన ఇద్దరు నైజీరియన్లు అడేయమీ అలియాస్‌ టిమోనీ, అయోబ్‌ హ్యాపినెస్‌లను సైబర్‌క్రైమ్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వీరినుంచి రూ.35 వేల నగదు, 8 చరవాణులు, 3 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ రఘువీర్‌ తెలిపారు. మరో ఇద్దరు నైజీరియన్లు కెల్విన్‌, అడేమోలా పరారీలో ఉన్నారని చెప్పారు. అపోలో ఫార్మసీ పేరుతో ఏడాది క్రితం నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి ప్రమాదకరమైన పొటాషియం సైనేడ్‌(విషం), అల్ప్రోజోలం వంటి నిద్రమాత్రల అమ్మకానికి సంబంధించిన వివరాలుంచారని తెలిపారు. అపోలో అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితులపై నిఘా ఉంచామనీ, ఒక రహస్య సమాచారం ద్వారా రెండ్రోజుల క్రితం ఇద్దరు నైజీరియన్లను గుర్తించి, నిర్ధరణ చేసుకున్నాక అరెస్ట్‌ చేశామని వివరించారు.

ఐదేళ్ల క్రితం చదువు నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన టిమోనీ, అయోబ్‌ వీసా గడువు ముగిసినా పేర్లు మార్చుకుని ఉండిపోయారు. అంతర్జాల ఆధారిత నేరాలు చేస్తున్న కెవిన్‌, అడేమోలాల పరిచయంతో నేరాలకు దిగారు. బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును తమ సొంత ఖాతాల్లో జమ చేయించుకోకుండా స్థానికులకు కొంత కమీషన్‌ ఇచ్చి వారి ఖాతాల్లో వేయించి వెంటనే తీసేసుకునేవారు. ఈ క్రమంలో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. దర్యాప్తులో టిమోనీకి బ్యాంకు ఖాతా ఇచ్చిన ఓ వ్యక్తి చరవాణి వివరాలు పరిశీలించగా.. కెవిన్‌, టిమోనీలు పుణెకు వెళ్తున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచే వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం లభించింది. అరెస్టైన ఇద్దరిపై ఐటీచట్టంతో పాటు పాస్‌పోర్టు చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌బాషా తెలిపారు.

SHARE