మార్కెట్ లో న‌కిలీ కండోమ్స్ హ‌ల్ చ‌ల్ …

97

The bullet news (Guntur)_ గుంటూరు జిల్లాలో ఏ వస్తువును చూసినా భయపడే రోజులివి. కల్తీతోపాటు నకిలీ వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తడమే దీనికి కారణం. నకిలీ లేని వస్తువును చూపిస్తే ప్రత్యేకంగా బహుమతి ఇస్తామని ప్రకటించే పరిస్థితి నెలకొంది. ఈ జాబితాలో కండోమ్‌లు కూడా చేరడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గుంటూరులోని ఆటోనగర్‌, నరసరావుపేటలోని శ్రీరామ్‌నగర్‌, కోట సెంటర్‌లలో నకిలీ కండోమ్‌ల తయారీ కుటీర పరిశ్రమల్లా చురుగ్గా ఉన్నట్లు సమాచారం. పదినుంచి 15 కుటుంబాలు ఈ పనిలోనే ఉన్నాయని తెలుస్తోంది. రెండు రకాలుగా నకిలీ కండోమ్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు.

వివిధ బ్రాండెడ్‌ కంపెనీల బాక్స్‌లపై సీల్స్‌ తీసేసి అందులో నకిలీ కండోమ్‌లు పెట్టి అమ్మేస్తున్నారు. కనీసం పది రూపాయలు కూడా విలువ చేయని కండోమ్‌లను రూ.200లకు అంటగడుతున్నారు. పరీక్షగా చూస్తేగానీ తెలియనంతగా అక్రమార్కులు జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. బ్రాండ్‌ అయితే దానిపై తయారీ, గడువు ముగిసే తేదీలు ఉంటాయి. కొనుగోలుదారులు అవేమీ చూడకుండా దుకాణదారు ఇచ్చిందే తడవుగా జేబులో పెట్టుకుని వెళ్లిపోతూ. ఎయిడ్స్‌ వంటి భయంకర రోగాల బారిన పడుతున్నారు. ఈ ఆతృతనే క్యాష్‌ చేసుకుంటున్నారు నకిలీరాయుళ్లు.

కేరళ నుంచి రసాయనాలు!
గడువు తీరిన ప్యాకెట్లపై తేదీలను స్పిరిట్‌ సాయంతో చెరిపేసి, రబ్బర్‌ స్టాంపులతో కొత్త తేదీలు వేసి అమ్మేస్తున్నారు. కేరళ నుంచి ప్రత్యేక రసాయనాలు తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కండోమ్‌లను వాడటంవల్ల అవి చినిగిపోయి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్యాకెట్లపై ఎటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు ఉండకూడదు. స్థానికంగా తయారవుతున్న కండోమ్స్‌పై రెచ్చగొట్టే చిత్రాలు కూడా అతికిస్తున్నారు.

కమీషన్‌ ఎక్కువ!
కండోమ్స్‌ తయారు చేసే సంస్థలు జాతీయ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సంస్థ సూచించిన నిబంధనలు పాటించాలి. ఈ నకిలీ కండోమ్‌ల తయారీలో అవేమీ ఉండవు. పైగా తయారీదారులే సొంతంగా మార్కెట్‌ చేసుకుంటున్నారు. వీటిని ఎక్కువగా వినియోగించే లాడ్జీలు, వ్యభిచార ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. రేటు తక్కువని చీకటి బేరం చేస్తూ అంటగట్టేస్తున్నారు. ఇంకొందరైతే దుకాణదారులతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. 60 శాతం డిస్కౌంట్‌, వెంటనే నగదు ఇవ్వాలనే ఒప్పందంపై లావాదేవీలు సాగుతున్నాయి. గుంటూరు, కృష్ణాజిల్లాలకు ఎక్కువగా నకిలీ కండోమ్‌లను సరఫరా చేస్తున్నారు.

SHARE