ఈ నెల 21 నుంచి రొట్టెల పండుగ – మేయర్ అజీజ్

136

The Bullet News – Nellore

రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగను ఈ నెల 21వ తేదీనుంచి నిర్వహిస్తున్నట్లు నగర మేయరు అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. పండుగ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా స్వర్ణాల చెరువు ప్రాంగణాన్ని మేయరు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల పాటు ఘనంగా జరిగే పండుగ నిర్వహణలో మహిళల రక్షణ, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిని సారించామని పేర్కొన్నారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో జరిగే రొట్టెల పండుగలో దేశ విదేశాల భక్తులకు సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులను చేపట్టామని వెల్లడించారు. ఏటికేడాది పెరుగుతున్న భక్తుల తాకిడిని, వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా శాశ్వత నిర్మాణాలను చేపట్టామని వివరించారు. రక్షణా ఏర్పాట్లలో భాగంగా రెండువేలమంది పోలీసులు పండుగ జరిగే ప్రాంగణమంతా బాధ్యతలు నిర్వహిస్తారనీ, పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులు సివిల్ డ్రెస్ కోడ్లో విధులు నిర్వర్తిస్తూ దొంగతనాలు, ఈవ్ టీజింగ్లకు పాల్పడే అల్లరి మూకల ఆట కట్టిస్తారని మేయరు తెలిపారు. కమాండ్ కంట్రోల్ విభాగం, ఇంటిలిజెన్స్, గగనతలంలో ఎగిరే నిఘా డ్రోన్ల సహకారంతో ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ పండుగకు విచ్చేసే ప్రజలకు అన్ని సౌకర్యాలను అందేలా కృషి చేస్తున్నామని మేయరు పేర్కొన్నారు. పారిశుధ్యపరంగా ప్రత్యేక ఏర్పాట్లను చేసి నగరంలోని పలు వాహన పార్కింగ్ స్థలాల్లో సైతం మరుగుదొడ్లను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని ఆయన చెప్పారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే బారాషహీద్ రొట్టెల పండుగకు పార్టీలకు అతీతంగా ప్రముఖులందరికీ స్వాగతం పలుకుతున్నామనీ, పండుగను ఘనంగా నిర్వహించి నెల్లూరు ఖ్యాతిని పెంచేందుకు నగరవాసులంతా సహకరించాలని మేయరు కోరారు. ఈ పర్యటనలో ఓఎస్ డి పెంచలరెడ్డి, టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి నన్నేసాహేబ్, నుడా డైరెక్టర్ ఖాజావలి, కార్పొరేటరు ప్రశాంత్ కుమార్, మైనార్టీ నాయకులు హయత్ బాబా, కార్పొరేషను అధికారులు, తదితరులు పాల్గొన్నారు..

SHARE