కాలువలకు నిధులు ఊటబారేనా..!

99

The bullet news(nellore)-  ఏటా జిల్లాపై కరవు  తాండవం చేస్తోంది. కురుస్తున్న అరకొర వర్షాలకు, పైనుంచి వచ్చే వరదనీటితో సోమశిల ప్రాజెక్టుమాత్రమే కొంతవరకు ఆదుకుంటుంది. డెల్టా ఎలాగోలా బయటపడుతున్నా మెట్టరైతులకు పంట చేతికందేవరకు నమ్మకం. సోమశిల జలాశయం నుంచి మెట్టప్రాంతాలకు వచ్చే కాలువలు, ప్రాజెక్టులు ఆధునికీకరణలేక సాగునీరు చివరి భూములవరకు చేరడం ప్రశ్నార్థకంగా మారుతోంది.  జిల్లాలో సోమశిల ఉత్తర కాలువ, దక్షిణకాలువ, సోమశిల-స్వర్ణముఖి అనుసంధాన కాలువ ,పెదిరెడ్డిపాడు ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టులు ఏళ్లతరబడి అసంపూర్తిగా ఉన్నాయి. ఈ నెల 8న బడ్జెట్‌ కేటాయింపుల్లోనైనా ఈ  కాలువలు, ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు జరగాలని అన్నదాతలు కోరుతున్నారు.  జిల్లాలోని సాగునీటి కాలువలు, ప్రాజెక్టులపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

అడుగు పడని ఎస్‌ఎస్‌ఎల్‌సీ
నెల్లూరు,చిత్తూరు జిల్లాల పరిధిలోని మెట్ట  గ్రామాలకు సాగు,తాగునీరిందించేందుకు తలపెట్టిన సోమశిల- స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌సి)పనుల్లో పురోగతి లేదు.15ఏళ్ల క్రితం ఈకాలువ నిర్మాణానికి  తెదేపా ప్రభుత్వం తొలుత రూ.390కోట్లతో అంకురార్పణ  చేసింది. సోమశిల, కండలేరు వరద కాలువ 12.41కిమీ వద్ద ఈకాలువ  ప్రారంభమై చిత్తూరు జిల్లా ఏర్పేడు  మండలం మేర్లపాక మనసముద్రం చెరువుల దాకా కాలువ నిర్మాణం చేపట్టేలా అప్పట్లో  సర్వే పనులు కూడా  చేపట్టడం జరిగింది. ప్రస్తుతం డక్కిలి  మండలం ఆల్త్దూరుపాడు గ్రామం నుంచి చిత్లూరు  జిల్లా మేర్లపాక, మన సముద్రం చెరు¢వుదాకా అంటే 100.425కిమీ దాకా కాలువ నిర్మాణం జరగనుంది.
కాలువ నిర్మాణం  పూర్తయితే నెల్లూరు జిల్లాలో 59,724ఎకరాలు, చిత్తూరు  జిల్లాలో 30,760 ఎకరాల  మెట్టభూములు   సాగులోకి రానున్నాయి.            పూల సుబ్బయ్య ప్రాజక్టు అడుగడుగునా ఆటంకాలు
వలిగొండ ప్రాజక్టులో అంతర్భాగమైన వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లెలో పూలసుబ్బయ్య ప్రాజక్టు నిర్మాణంకు సంబంధించి 2009 ఫిబ్రవరి 26న భూమిపూజ చేశారు. నాలుగేళ్లల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనిర్మాణం పూర్తి అయితే మెట్ట ప్రాంతంలో తాగునీటితోపాటు ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలలో 65వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈప్రాజక్టును రూపకల్పన చేసి కడప జిల్లా చెందిన ఎమ్మార్‌కేఆర్‌ కన్‌స్ట్రక్షన్‌కు పనులు అప్పగించారు. రూ.1135.84 కోట్లతో పనులు ప్రారంభమై తొమ్మిది ఏళ్లు పూర్తి అయినప్పటికీ కనీసం 60 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. రైతులకు పరిహారం చెల్లించకపోవడంతో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.ప్రాజక్టు నిర్మాణానికి 785.69 ఎకరాలు అవసరమైంది.ఈ సారి  బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతోంది.                                                                   శిలాఫలకం సరే నీటి గలగలలు ఏవి
మెట్టప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి, సీతారామపురం మండలాల్లో సస్యశ్యామలం చేసి సాగునీటి సమస్యను పరిష్కరిచాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయతలచిన సీతారాంసాగర్‌ జలాశయం  శిలాఫలకానికే పరిమితమైంది.  చివరికి  పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగం సీతారాంసాగర్‌ జలాశయం ఏర్పాటుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉదయగిరిలో 2008లో శిలాఫలకాన్ని వేశారు.  ప్రాజెక్టు ఏర్పాటుకు అప్పట్లో నిధులను కూడా కేటాయించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం యడపల్లి వద్ద వలిగొండ టన్నెల్‌ నుంచి బయటకు వచ్చే నీటిని అక్కడి నుంచి కడపజిల్లా పోరుమామిళ్ల మండలం మల్లెపల్లి వరకు ఏర్పాటుచేసే పడమటి కాలువ ద్వారా తరలించాల్సి ఉంది.  అక్కలరెడ్డిపల్లి, ప్రకాశం జిల్లా వి.బైలు మధ్యలో ఉండే కొండకు సొరంగ మార్గం ఏర్పాటుచేసి ఆనీటిని కాలువ ద్వారా సీతారామపురం రంగనాయుడుపల్లి వద్ద సీతారాంసాగర్‌ జలాశయాన్ని ఏర్పాటుచేసి అక్కడికి తరలించేలా చేయాలని ప్రణాళిక చేశారు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం ఒకటిన్నర టీఎంసీలతో 15 వేల ఎకరాలకు సాగునీరందించాలని ఏర్పాట్లుచేశారు. 2008 శిలాఫలకం వేశారేగాని సీతారాంసాగర్‌ జలాశయం ఆచరణలో ఏర్పాటుకాలేదు.                     ఉత్తర కాలువ నిర్మాణం లోపాలతోనే ఆపసోపాలు
మెట్టప్రాంతంలోని రైతన్నలను ఆదుకునేందుకు సోమశిల గొట్టిపాటి కొండపనాయుడు  ఉత్తరకాలువతోనే సాధ్యం. ఎన్నో ఉద్యమాలవల్ల 2005లో కాలువ నిర్మాణం పురుడుపోసుకుంది. 2007 నుంచి పనులు ప్రారంభంకాగా పదేళ్లు అయినా ఇంకా అసంపూర్తి నిర్మాణంతోనే కాలువ ఉంది. మెట్టప్రాంతంలోని 54వేల ఎకరాలకు సాగునీరందడం కలగా మారింది. పదేళ్లుగా కాలువ నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నాయి. సక్రమంగా బెడ్‌లెవెల్స్‌ తీయకపోవడం, సకాలంలో సిమెంటు నిర్మాణాలు (స్ట్రక్చర్స్‌) నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి కాకుటూరు, శ్రీకొలను డిస్ట్రిబ్యూటరీల కాలువ పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. కాలువను 780 క్యూసెక్కుల నీటి సామర్ధ్యంతో తవ్వినా 450 క్యూసెక్కుల కట్టలు పొంగిపొర్లుతున్నాయి. చివరిభూముల వరకు సాగునీరు అందాలంటే కాలువను 1000 క్యూసెక్కుల నీటిసామర్థ్యంతో తవ్వాలి. ఇందుకు ప్రస్తుతం కాలువను వెడల్పుచేసి బెడ్‌లెవల్స్‌ పెంచి లైనింగ్‌చేయాలి. పోలవరం పూర్తయి నదుల అనుసంధానం ద్వారా గోదావరి- కృష్ణా, అక్కడి నుంచి పెన్నాలోచేరి సోమశిలకు వస్తే ఈ కాలువ ద్వారా చివరి భూములకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవచ్చు. ప్రస్తుతం కావలి కాలువ 0 కి.మీ నుంచి 100 కి.మీ దూరానికి   రూ.92 కోట్లు వెచ్చించారు. ఇందులో గుత్తేదారు 23 శాతం లెస్‌తో రూ.72 కోట్లుతోనే అసంపూర్తిగా పనులు చేశారు.                                                                       లీకుల మయం దక్షిణ కాలువ
పథకం: సోమశిల దక్షిణ కాలువ ,
ఆయకట్టు: 41 వేల ఎకరాలు
ప్రస్తుతంసాగులో ఉన్న ఆయకట్టు 32 వేల ఎకరాలు
ప్రస్తుత స్థితి: దక్షిణ కాలువ కింద 16 వేల ఎకరాల మాగాణి, 25 వేల ఎకరాల మెట్ట భూములకు నీరివ్వాల్సి ఉంది. ఆయకట్టు పరిథిలోని రైతులందరు ఆరుతడికి బదులు వరిసాగుకే  మొగ్గు చూపుతున్నారు.ఎగువనీరు కాలువ నుంచి భారీగా లీకై చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దిగువ అవసరాలకు చాలినంత నీరు రావటం లేదు.సోమశిల దక్షిణ కాలువను పూర్తిగా కాంక్రీట్‌ లైనింగ్‌ వేసేందుకు ప్యాకేజి నెం-35 కింద రూ 33 కోట్లతో 2006 లో పనులు చేపట్టారు. గుత్తేదారులు తక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకొని 25 శాతం పనిచేశాక గిట్టుబాటు కాలేదంటూ పనులు ఆపేశారు.దక్షిణ కాలువ ఆయకట్టు అంతటికి పూర్తి స్థాయిలో నీరందించాలంటే రూ. 35 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపింది.

కాసులు కరుణిస్తేనే సాగు
పథకం: సోమశిల- స్వర్ణముఖి ప్యాకేజీ నెం: 12
లక్ష్యం: సోమశిల దక్షిణ కాలువ, కండలేరు వరద కాలువ మధ్యనున్న 14 వేల ఎకరాల భూములకు సాగునీరందించటం.
నీటి లభ్యత: నల్లవాగు పరివాహిక ప్రాంతంలోని వర్షపునీరు సద్వినియోగం చేసుకోవటం, కండలేరు వరద కాలువ ద్వారా చెరువులకు నీరందించటం.
నిర్మాణ క్రమం: తోపుగుంట, కండాపురం, కేశమనేనిపల్లి, చవటపల్లి వద్ద చెరువులు నిర్మించి నీటిని నిలువ చేయటం, కాలువల ద్వారా పొలాలకు అందించటం. ఇందు కోసం ఎస్‌ఎస్‌ఎల్‌సీ ప్యాకేజి నెం. 12 పేర 28 కోట్ల పథకాన్ని చేపట్టారు. 2009 లో మొదలైన పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.7.50 కోట్లు ఖర్చు చేశారు. మరో ఆరు కోట్ల రూపాయలు గుత్తేదారులకు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం చేసిన పనులకు బకాయిలు చెల్లించని కారణంగా గుత్తేదారులు పనులు నిలిపివేశారు.
ప్రయోజనాలు: చేజర్ల, కలువాయి మండలాల్లోని 20 గ్రామాల పరిథిలో 14 వేల ఎకరాలకు తాగు, సాగునీటి సమస్య తీరుతుంది. మెట్ట ప్రాంత గ్రామాల్లో భూగర్భజలాలు వృద్ది చెందుతాయి.వృథాగా నల్లవాగు మీదగా సముద్రం పాలవుతున్న 0.7 టీఎంసీల మేర వర్షపు నీటి నిలువకు అవకాశం కలుగుతుంది.

SHARE