THE BULLET NEWS (NEW DELHI)-ఏపీకి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు చేస్తున్న నిరసన కొనసాగుతోంది. బడ్జెట్ తొలి విడత సమావేశాలకు నేడే చివరి రోజు కావడంతో ఎంపీలు ఆందోళనను మరింత ఉదృతం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విచిత్ర వేషధారణతో తనదైన రీతిలో నిరసన తెలిపారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర మిగిలిన టీడీపీ ఎంపీలంతా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపితే.. శివప్రసాద్ మాత్రం కింద కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ప్రజలను మోసం చేయడమే కాకుండా తిరుపతి వెంకటేశ్వరస్వామిని కూడా మోసం చేశారని ఎంపీ శివప్రసాద్ చెప్పారు. బెజవాడ కనకదుర్గమ్మను కూడా మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతిలో మోదీ అనేక హామీలిచ్చారని, ఇప్పుడు ఆ హామీలన్నీ మర్చిపోయారని ఎంపీ ఆరోపించారు.

తిరుమల వెంకన్నను లక్షలాది మంది దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారని, అలాంటిది ఆయనను మోసం చేస్తే ఇబ్బందులు తప్పవని ప్రధానికి పరోక్షంగా చురకలంటించారు. భక్తులంతా వెంకటేశ్వరస్వామిని వెతుక్కుంటూ తిరుమల వెళుతుంటే.. ఆయన మాత్రం మోదీని వెతుక్కుంటూ పార్లమెంట్‌కు వచ్చి తనలో పూనాడని ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యానించారు. మోదీ ఇప్పటికైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ డిమాండ్ చేశారు.

 

SHARE