ఎరువు కొనేందుకు వెళ్లి అనంతలోకాలకు

140

The bullet news(guder )- పైరుకు ఎరువులు వేసి త్వరగా ఇంటికి వస్తానని చెప్పి వెళ్లిన ఆ రైతు అనంత లోకాల బాట పట్టారు. ఆ మాటలే ఆఖరివయ్యాయి. వీటిని తలచుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోమవారం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరు మండలం చెంబడిపాలేనికి చెందిన పల్లిపాటి సిద్దయ్య(55) అక్కడికక్కడే మృతిచెందగా, పొట్టేళ్ల మల్లికార్జున్‌ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు సిద్దయ్యకు గూడూరు సమీపంలోని పైడమ్మతల్లి ప్రాంతం బద్వేల్‌ క్రాస్‌రోడ్డు ఎదురుగా కొంత పొలం ఉంది. దానిలో వరిపైరు వేశారు. స్వగ్రామం నుంచి మోటారుసైకిల్‌పై సిద్దయ్య, పొట్టేళ్ల మల్లికార్జున్‌ గూడూరుకు చేరుకొని అక్కడ ఎరువులను కొనుగోలు చేసి పొలాల వద్దకు వెళ్తున్నారు. గూడూరు సమీపంలోని ఆదిశంకరా కళాశాల ఎదురుగా జాతీయ రహదారిపై మోటారుసైకిల్‌పై వెళ్తుండగా అదే సమయంలో చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్లే లారీ అతివేగంగా ఢీ కొనడంతో వెనక ఉన్న సిద్దయ్య అక్కడికక్కడే మృతిచెందారు. మల్లికార్జున్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను 108 వాహనంలో చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ వెళ్లిపోయింది. పంట పొలాలకు ఎరువులు వేసి వస్తానని చెప్పివెళ్లిన సిద్దయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న సమాచారంతో చెంబడిపాలెం గ్రామస్థులు అధిక సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామీణ ఎస్సై బాబీ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని మరణానంతర పరీక్షల నిమిత్తం గూడూరుకు తరలించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంతో గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళ్లే వాహనాల రాకపోకలు స్తంభించాయి. పోలీసులు చేరుకొని క్రమబద్ధీకరించారు. మృతుడికు భార్య పద్మతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆసుపత్రి వద్ద సిద్దయ్య భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చెంబడిపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి.

SHARE