నాని మూవీ ఎంసీఏ ఎలా ఉంది.? లుక్ అట్ దిస్ వ‌న్స్

127
ఇప్ప‌టి కే 7 వ‌రుస హిట్ మూవీస్ చేస్తున్న యువ క‌థానాయ‌కుడు నాని…ఈ2017లో ఐదు విజ‌య‌వంత‌మైన చిత్రాలు చిత్రాలను నిర్మించి డ‌బుల్ హ్య‌ట్రిక్ కోసం ఎదురు చూస్తున్న నిర్మాత దిల్‌రాజు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా అంటే ఎలాగూ ఆస‌క్తి ఉంటుంది. మ‌రో విష‌య‌మేమంటే దిల్‌రాజు ఈ ఏడాది సాధించిన ఐదు హిట్ చిత్రాల్లో నాని న‌టించిన `నేను లోకల్‌` కూడా ఒక‌టి. అంటే ఇదే ఏడాది ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా. అయితే ఐదేళ్లు ముందు ఓ మై ఫ్రెండ్ అనే ప్లాప్ సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శ్రీరామ్‌వేణు మ‌రో వైపు ఉండ‌టం..ప్రేక్ష‌కుల‌ను మీమాంస‌కు గురి చేసింది. అయితే..టైటిల్, ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ అన్ని సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌స్తున్నాయి. మ‌రి ఈ అంచ‌నాల‌ను సినిమా ఏ మేర రీచ్ అయ్యిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో తెలుసుకుందాం.
కథ:
చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో నాని(నాని)ని పెంచి పెద్ద చేస్తాడు..అతని అన్నయ్య(రాజీవ్‌ కనకాల). ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. అన్నయ్యకు జ్యోతి(భూమిక) అనే అమ్మాయితో పెళ్లవుతుంది. జ్యోతి రాకతో అన్నయ్య దగ్గర తనకు ప్రాధాన్యత తగ్గుతుందని, అందుకు కారణం తన వదినే అని నాని అనుకుంటాడు. అందుకని హైదరాబాద్‌లోని తన పిన్ని వాళ్లింట్లో కొన్ని రోజులు ఉంటాడు. అదే సమయంలో ఆర్‌.టి.ఒ ఆఫీసర్‌ అయిన జ్యోతికి వరంగల్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అన్నయ్య ఢిల్లీలో ట్రైనింగ్‌కు వెళ్లడంతో..అన్నయ్య కోసం వదినతో పాటు వరంగల్‌ చేరుకుంటాడు నాని. అక్కడే పల్లవి(సాయిపల్లవి)ని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. కథ ఇలా సాగే క్రమంలో వరంగల్‌లో శివశక్తి ట్రావెల్స్‌ అధినేత శివ(విజయ్‌ వర్మ) బస్సులన్నీ ఆక్రమంగా నడుస్తున్నాయని జ్యోతి సీజ్‌ చేస్తుంది.
దాంతో జ్యోతిపై కక్ష కట్టిన శివ, అతని మనుషులు ఆమెను చంపే ప్రయత్నం చేస్తుంటారు. అదే సమయంలో వదిన మంచితనం తెలుసుకున్న నాని..ఆమెను కాపాడుకుంటాడు. అయితే జ్యోతిని పదిరోజుల్లో చంపేస్తానని..అలా చంపకుంటే ఆమెను ఏమీ చేయకుండా వదిలేస్తానని నాని దగ్గర చాలెంజ్‌ చేస్తాడు శివ. అలాగే ఈ పదిరోజులు తన వదినను కాపాడుకుంటానని శివ దగ్గర చాలెంజ్‌ చేస్తాడు నాని. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు? ఆ క్రమంలో నానికి ఎదురైన సవాళ్లేంటి? శివ నుండి తన వదినను నాని ఎలా కాపాడుకుంటాడు? నాని, పల్లవి ఒకటవుతారా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
బలాలు:
నటీనటులు
సంభాషణలు
కామెడీ
సినిమాటోగ్రఫీ
వదిన..మరిది అనే బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా
బలహీనతలు:
కొత్త కథేం కాదు..కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌
సంగీతం
విశ్లేషణ:
నటీనటుల పనితీరు విషయానికి వస్తే కథంతా ఎక్కువ భాగం నలుగురు పాత్రధారులు మధ్యనే నడుస్తుంది. అందులో మొదటగా నానిని చూస్తే..ఎప్పటిలాగానే తన ఎనర్జిటిక్‌ పెర్‌ఫార్మెన్స్‌తో సినిమా అంతటా తనదైన నటనను కనపరిచాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్‌లో తనదైన హావభావాలను పలికించాడు. అలాగే డ్యాన్సులు కూడా చక్కగా చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ ఫైట్‌ సీన్‌కు ముందు వదిన మంచి తనాన్ని అర్థం చేసుకునే సన్నివేశంలో..అలాగే చివరి పదిహేను నిమిషాలు వదినను కాపాడుకునే సన్నివేశంలో నాని నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఇక భూమిక చావ్లా, మంచి పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె పాత్రను చక్కగా తీర్చిదిద్దారు. హుందాగా కనపడుతుంది. ఇక విలన్‌ విజయ్‌ వర్మ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక సాయిపల్లవి తన నటనతో నానికి గట్టిపోటినే ఇచ్చింది. నాని, సాయిపల్లవి కలిసి నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆట్టుకుంటాయి. సాయిపల్లవి, నాని దగ్గర లవ్‌ ప్రపోజ్‌ చేసే సీన్‌తో పాటు, నానిని ,అతని ఇంట్లోనే ఉండి టీజ్‌ చేసే సీన్‌ ఇలా అన్నింటా నటనతో తనదైన ముద్ర వేసింది సాయిపల్లవి. ఇక సీనియర్‌ నరేష్‌, ఆమని, రాజీవ్‌ కనకాల, నాని స్నేహితులుగా నటించిన ప్రియదర్శి, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..దర్శకడు శ్రీరామ్‌ వేణు సినిమాను చక్కగా తెరకెక్కించాడు. మిడిల్‌ క్లాస్‌ వ్యక్తులు..సమస్యలను ఎలా దాటుకుంటూ వెళ్తారు. అదే సమస్యను ఫేస్‌ చేసేటప్పుడు ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది సంభాషణలు, సీన్స్‌ రూపంలో బాగా ప్రెజంట్‌ చేశాడు. వదిన, మరిది మధ్య ప్రేమానుబంధాన్ని తెలిపే సినిమాలు చాలానే వచ్చినా..పూర్తి స్థాయిలో వదినను విలన్‌ బారీ నుండి కాపాడుకునే మరిది అనే బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఇంత వరకు రాలేదు.
ఆ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు కథను రాసుకున్నాడు. అందుకు తగిన విధంగా ముందు వదిన, మరిది మధ్య కోపతాపాలుండే సన్నివేశాలు..అర్థం చేసుకున్న తర్వాత వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ముఖ్యంగా చివరి పదిహేను నిమిషాలు సినిమా డ్రైవ్‌ బాగుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో టైటిల్‌ సాంగ్‌ మినహా..మిగిలిన పాటలు ఆకట్టుకోలేదు. అలాగే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా పెద్ద ఎఫెక్టివ్‌గా లేదు. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది. సెకండాఫ్‌లో రెండు, మూడు సీన్స్‌ మినహా ప్రవీణ్‌పూడి తన కత్తెరకు బాగానే పని చెప్పాడు. ప్రారంభంలో రాజీవ్‌ కనకాల, నాని మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు బావుంటాయి. కామెడీ పరంగా వచ్చే సీన్స్‌, సంభాషణలు పడి పడి నవ్వేంత లేకపోయినా, ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసేంత బావుంటాయి.
                     చివరగా…మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి..మెప్పిస్తాడు
                                         రేటింగ్‌: 3.25/5
SHARE