తలదిండుతో భర్తను చంపిన భార్య

166

THE BULLET NEWS (NALGONDA)-నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే తలదిండుతో వూపిరాడకుండా చేసి చంపేసింది ఓ భార్య. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం ఏపూరు తండాకు చెందిన సోమకు నాగర్‌కర్నూలుకు చెందిన భారతితో పదమూడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి పదేళ్ల బాలుడు వున్నాడు. అయితే గత కొన్నేళ్ళుగా భారతి ప్రవర్తనలో మార్పు వచ్చింది.  గమనించిన భర్త సోమ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పురాలేదు. రెండురోజులకొకసారి వూరికి వెళ్లడం, ఫోన్లు ఎక్కువగా మాట్లాడడం చేస్తుండేది. దీంతో ఆ ఇంట్లో తరచూ కలహాలు జరుగుతుండేవి. ఈ గొడవల వల్ల వారి కొడుకు స్కూలుకెళ్లడం మానేశాడు. భార్యలో మార్పు రాకపోవడంతో సోమ మద్యానికి బానిసయ్యాడు.  ఈ క్రమంలో గురువారం కూడా ఇంట్లో మరోసారి మనస్పర్థలు చెలరేగాయి. దీంతో అర్థరాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్తను భారతి తలదిండుతో వూపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్టుగా తన భర్త మృతి చెందాడంటూ ఇరుగుపొరుగు వారిని నమ్మించింది. వారు మృతదేహాన్ని పరిశీలించగా గొంతుపై గాయాలున్నట్టు గుర్తించారు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భారతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.అనంతరం కేసు నమోదుచేసి ఆమె నుంచి వివరాలను సేకరిస్తున్నారు.

SHARE