బడిలోనే అమానుషం

68

The bullet news (Crime)-  ఓ అనుమానపు భర్త ప్రధానోపాధ్యాయురాలైన భార్యపై బడిలోనే కత్తితో దాడిచేసిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా ముస్లాయిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మక్తల్‌ మండలం దాదన్‌పల్లికి చెందిన కన్యాకుమారి ముస్లాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తుండగా.. భర్త రమణారెడ్డి అక్కడే ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారు. వీరికి నాలుగేళ్లలోపు జోషిక, అనన్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రమణారెడ్డి భార్యపై అనుమానంతో తరచూ గొడవపడేవాడని కన్యాకుమారి తల్లిదండ్రులు తెలిపారు. మంగళవారం రాత్రి కూడా అలాగే భార్యతో గొడవపడ్డాడు. బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన అతడు హెచ్‌.ఎం. గదిలోనే భార్యపై కత్తితో దాడి చేశాడు. ఆమె చేయి అడ్డం పెట్టడంతో కడుపు వద్ద, చేతికి గాయాలయ్యాయి. సిబ్బంది, తోటి ఉపాధ్యాయులు పరిగెత్తుకొచ్చి అతడిని అడ్డుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో నిందితుణ్ని కొట్టబోగా బ్లేడుతో గొంతుకోసుకుంటానని బెదిరించి గాట్లు పెట్టుకుని పారిపోయాడు. తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో చేర్చారు. కన్యాకుమారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు మక్తల్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు చెప్పారు.

SHARE