ఐపీఎల్ తొలి క్వాలిఫయర్‌ నేడే…

117

THE BULLET NEWS (MUMBAI)-ఐపీఎల్ అంటేనే హంగామా, జోష్, ఈ పొట్టి ఫార్మాట్‌లో ఏ మ్యాచ్ జరిగినా అందరి కన్ను అటువైపే… లీగ్ దశలోనే ఇలా ఉంటే… మరి క్వాలిఫయర్‌కు వచ్చేసరికి మరింత ఉత్కంఠ. ఇక క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలైన కిక్కిచ్చే క్వాలిఫయర్ మ్యాచ్‌లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. ఆడిన 14 మ్యాచ్‌లలో 9 మ్యాచ్‌లలో విక్టరీ కొట్టి 18 పాయింట్లతో టాప్ స్పాట్‌లో ఉన్న ఈ రెండు జట్లు తొలి క్వాలిఫయర్‌లో ఢీకొట్టబోతున్నాయి. టీ20ల్లోని అసలైన మజా పంచడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.

అయితే ఇప్పటి వరకు హైదరాబాద్‌తో రెండు సార్లు తలపడిన చెన్నై జట్టు… ఆ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి ఢీకొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగుపెట్టనుంది. దీంతో ఈ మ్యాచ్‌పైనే అందరి దృష్టి ఉంది. చెన్నై చేతిలో రెండోసార్లు ఓడిన హైదరాబాద్‌ ఈ సారి ప్రతీకార తీర్చుకోవడంతో పాటు ఫైనల్‌లో అడుగుపెట్టాలని చూస్తుండగా… మిస్టర్ కూల్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌… కూల్‌గా విక్టరీ కొట్టాలని చూస్తోంది. ఇక ఐపీఎల్‌ ఈ సీజన్‌లో హోరాహోరీగా సాగిన లీగ్‌ దశ ఆదివారం ముగియగా… నాలుగు జట్ల మధ్య ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఫ్యాన్స్‌ను కనువిందు చేయనున్నాయి. ఈ రోజు సన్‌రైజర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ వాంఖడే స్టేడియంలో జరగనుండగా… ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఈనెల 25న కోల్‌కతాలో జరిగే క్వాలిఫయర్‌-2లో తలపడనుంది. ఇక అర్ధరాత్రి వరకు మ్యాచ్‌లు జరుగుతుండడంతో మ్యాచ్‌లను తిలకించేవారి సంఖ్య తగ్గుతుండడాన్ని గమనించిన ఐపీఎల్ మేనేజ్‌మెంట్… గంట ముందుగానే మ్యాచ్‌లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే… దీంతో ఈ సీజన్‌లో మిగతా మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకే స్టార్ట్ కానున్నాయి.

SHARE