ఐ.పి.ఎల్ షెడ్యూల్ చేంజ్…

36

THE BULLET NEWS (NEW DELHI)- ఇకపై ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం అర్ధరాత్రిదాకా మేల్కొని ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో మాదిరిగా రాత్రి మ్యాచ్‌లు 8 గంటలకు బదులు ఈ సీజన్‌లో 7 గంటలకే మొదలవుతాయి. సాయంత్రం మ్యాచ్‌ కూడా మారింది. వేసవి తాపంలో 4 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ కోసం మధ్యాహ్నం 2 గంటలకే స్టేడియానికి చేరాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్‌లను సాయంత్రం 5.30 గంటల నుంచి నిర్వహించాలని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పాలక మండలి నిర్ణయించింది. ప్రసార సంస్థ వినతి మేరకు షెడ్యూల్‌ సమయాన్ని మార్చినప్పటికీ… యేటికేడు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈ మార్పు స్టేడియంలోని ప్రేక్షకులకు పెద్ద ఊరటనే చెప్పాలి. ఎండ తగ్గాక మొదటి మ్యాచ్‌ మొదలైతే… అర్ధరాత్రి కంటే ముందే రెండో మ్యాచ్‌ ముగుస్తుంది.

ఇంటికి చేరే సమయం కలిసొస్తుంది. సోమవారం 11వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాలక మండలి ఖరారు చేసింది. ఏప్రిల్‌ 7 నుంచి మే 27 వరకు ఈ సీజన్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆనవాయితీ ప్రకారం డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టుకు చెందిన వాంఖెడే స్టేడియంలో తొలి, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు తమ హోం మ్యాచ్‌ల్లో నాలుగింటిని మొహాలీలో, మరో మూడు మ్యాచ్‌ల్ని ఇండోర్‌లో ఆడుతుంది. రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ల నిర్వహణపై హైకోర్టు (ఈ నెల 24) విచారణ అనంతరం నిర్ణయిస్తారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే వేలానికి 578 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు.

SHARE