ఇస్రో సెంచరీ…. ఇలా జరిగింది…

79

The bullet news (Srihari)- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారతీయులు గర్వపడే ఘన చరిత్ర సృష్టించింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్‌వీ సీ-40) ద్వారా కార్టోశాట్ -2 సిరీస్, 29 ఇతర ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. మరొక ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టవలసి ఉండటంతో ఈ ప్రయోగం కొనసాగుతోంది. అమెరికా, ఫ్రాన్స్, ఫిన్లాండ్, బ్రిటన్, దక్షిణ కొరియా, కెనడా దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను శుక్రవారం నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

శుక్రవారం ఉదయం 9.29 గంటలకు ప్రయోగం ప్రారంభమైంది. అనంతరం 17 నిమిషాల తర్వాత ప్రధానమైన 710 కేజీల బరువుగల కార్టోశాట్ 2 సిరీస్ పోలార్ సన్ సింక్రనస్ కక్ష్యలోకి ప్రవేశించింది. 510 కి.మీ. దూరంలో ఈ కక్ష్య ఉంది. కార్టోశాట్ సిరీస్‌లో ఇది 7వది. మరొక 7 నిమిషాల్లో 519 కి.మీ. దూరంలో 29 నానో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి పంపించింది.

రాకెట్ నుంచి 30వ ఉపగ్రహం వేరైన తర్వాత నాలుగో దశ ఎర్త్ స్టోరబుల్ లిక్విడ్ ఇంజిన్ మొదటిసారి 30 నిమిషాల అనంతరం రీస్టార్ట్ అయింది. 5 సెకండ్ల తర్వాత అది షట్ ఆఫ్ అయింది. తదుపరి 45 నిమిషాలు అత్యంత కీలకమైన కోస్టింగ్ పీరియడ్ కొనసాగుతుంది. ఈ సమయంలో ఇంజిన్ రెండోసారి ఐదు సెకండ్లపాటు రీస్టార్ట్ అవుతుంది. తదుపరి 45 నిమిషాల్లో 31వ ఉపగ్రహం ఈ రాకెట్ నుంచి వేరవుతుంది. ఇది ఇస్రోకు చెందిన మైక్రోశాట్ ఉపగ్రహం. రెండో కక్ష్యలోకి ఇది ప్రవేశించబోతోంది.

SHARE