టిడిపిని ఇబ్బందుల్లోకి నెట్టిన జగన్ వ్యూహం..

673

The Bullet News ( Amaravathi )- ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీ నడుస్తుందని.. అధికార పక్షమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నా లోలోన వారు కూడా అంతర్మథనం చెందుతున్నారు. అసెంబ్లీని వైసీపీ బాయ్ కాట్ చేయడంపై టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ప్రైవేట్ సంభాషణల్లో ఏం చెబుతున్నారన్న దానిపై ప్రముఖ ఆంగ్ల పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం… వైసీపీ వ్యూహంతో తాము ఇబ్బందుల్లో పడ్డామని అధికారపార్టీ సభ్యులు వాపోతున్నారు.

ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ జరగడం ఎక్కడా లేదని…. అలాంటి పరిస్థితిని సృష్టించడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా జగన్‌ చేశారని ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. పల్నాడు ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు పత్రిక చెబుతోంది. అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలోనూ సభ్యుల మధ్య వైసీపీ బాయ్‌కాట్‌ పైనే ఎక్కువగా చర్చ జరుగుతోందని వెల్లడించింది.
అసెంబ్లీని వైసీపీ బహిష్కరించడం ద్వారా ఏపీలో భారీగా జరిగిన ఫిరాయింపులను జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లడంలో వైసీపీ విజయం సాధించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఒకరు అభిప్రాయపడ్డారు. జగన్‌ను తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ… ఫిరాయింపుల అంశాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు జగన్ తీసుకున్న నిర్ణయం గట్టిగానే పనిచేస్తోందని సదరు పొలిట్ బ్యూరో సభ్యుడు వ్యాఖ్యానించారు. ఈ పరిణామం జాతీయ స్థాయిలో టీడీపీ ప్రతిష్టకు చికాకు కలిగించే అంశమేనని అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్షం లేని అసెంబ్లీ ప్రత్యర్థిలేని యుద్ధరంగంలా ఉందని ఒక సభ్యుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా తొలి రోజు సభకు 74 మంది సభ్యులు మాత్రమే రావడంపైనా ఒక సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా ప్రతిపక్షం లేని సభలో నిద్ర వస్తోందని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ప్రతిపక్షం లేని ఏపీ అసెంబ్లీ తన ప్రాధాన్యతను కోల్పోయినట్టుగా భావిస్తున్నారు.

SHARE