వైసీపీ ఎంపీల ముందు మీసం తిప్పి సవాల్ విసిరిన జేసీ

112

The bullet news (Delhi)- ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్లమెంటు వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తుండగా.. పార్లమెంటు ముఖద్వారం వద్ద వైసీపీ ఎంపీలో ప్లకార్డులు పట్టుకుని నిల్చున్నారు. వైసీపీ ఎంపీలను గమనించి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వైవీ సుబ్బారెడ్డి దగ్గరకు వెళ్లి ‘‘నిన్న నువ్వు మాట్లాడింది ఏంటయ్యా.. నీకు దమ్ముంటే రాజీనామా చెయ్.. మేము కూడా రాజీనామా చేస్తాం. మళ్లీ పోటీ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు దమ్ముందా’’ అంటూ మీసం మెలేసి తొడకొట్టి సవాల్ విసిరారు. తాము కూడా రాజీనామాకు సిద్ధమేనని వైసీపీ ఎంపీలు కూడా ప్రతి సవాల్ చేశారు. ఆ సమయంలో ఎంపీలు కొట్టుకొంటున్నారేమో అన్నట్లు వాతావరణం ఉండడంతో పార్లమెంటు సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే కొద్ది సేపటికే పరిస్థితి సద్దుమణిగి ఇరు పార్టీల ఎంపీలు పార్లమెంటులోకి వెళ్లి వెల్‌లో తమ నిరసన తెలియజేశారు.

బుధవారం రాత్రి సీఎం చంద్రబాబు కేంద్రమంత్రుల రాజీనామా ప్రకటన చేయడంతో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాత్రి 11.30 గంటల సమయంలో ప్రెస్‌మీట్ పెట్టి టీడీపీ రాజీనామా డ్రామాలు ఆడుతోందని ఆరోపణలు చేసిన నేపథ్యంలో జేసీ దివాకర్‌రెడ్డి ఆ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.
SHARE