లంకదే తొలి వన్డే!… 21 ఓవర్లలోనే విజయాన్ని అందుకున్న పర్యాటక జట్టు

75

The bullet news (Darmasala)_ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై లంక ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 113 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 20.4 ఓవర్లలో 114 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. దనుష్క గుణతిలక (1), ఉపుల్ తరంగ (49), లహిరు తిరుమన్నె (0) వికెట్లను కోల్పోయి అలవోకగా విజయ తీరానికి చేరుకుంది. ఉపుల్ తరంగ ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఏంజెలో మాథ్యూస్ (25), నిరోషన్ డిక్‌వెల్లా (26) కలిసి జట్టుకు తొలి విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా చెరో వికెట్ తీశారు.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా వికెట్లను టపటపా కోల్పోయింది. బ్యాట్స్‌మెన్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరారు. లంక బౌలర్ సురంగ లక్మల్ నిప్పులు చెరిగే బంతులకు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. భారత బ్యాట్స్‌మెన్‌లలో మహేంద్రసింగ్ ధోనీ (65), హార్ధిక్ పాండ్యా (10), కుల్దీప్ యాదవ్ (19)లు మినహా మిగతా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. ఐదుగురు ఆటగాళ్లు ఖాతానే తెరవలేదు. ఇద్దరు రెండు పరుగులు మాత్రమే చేశారు. శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్ 4, నువాన్ ప్రదీప్ 2 వికెట్లు, మాథ్యూస్, తిసారా పెరీరా, అకిల దనంజయ, పథిరానా చెరో వికెట్ తీసుకున్నారు.

SHARE