లాంచీ మునక.. కొనసాగుతున్న సహాయచర్యలు

13

 The bullet news ( తూర్పుగోదావరి)-  తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు.. పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య నిన్న రాత్రి గోదావరిలో లాంచీ మునిగిన ఘటనలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సుమారు 50 మందితో ప్రయాణిస్తున్న లాంచీ భారీ వర్షానికి తోడు తీవ్రమైన గాలులు వీచడంతో అదుపుతప్పి గోదావరిలో మునిగిపోయింది. ఆ వెంటనే కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా సుమారు 34 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు, సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయచర్యలకు అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ 120 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రాత్రంగా గాలిస్తూనే ఉన్నారు. హెలికాప్టర్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. గోదావరిలో నీటిలోతున గాలించిన సిబ్బంది 40 అడుగుల లోతుతో లాంచీ ఉన్నట్లు గుర్తించారు. లాంచీని వెలికితీసేందుకు భారీ క్రేన్‌ను సిద్ధంగా ఉంచారు. గల్లంతైన వారి ఆచూకీ ఇంకా దొరకకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.

ఈ ప్రమాద ప్రదేశం తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో ఉంది. సమీప గ్రామమైన మంటూరు సమీపానికి చేరడమే చాలా కష్టంగా ఉంది. ఆ మార్గం ఏ మాత్రం సహకరించడం లేదు. ఎట్టకేలకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌, ఎమ్మెల్యేలు ప్రమాద ప్రాంత సమీప గిరిజన గ్రామానికి చేరుకున్నారు. వర్షం కూడా ఉండడంతో గాలింపు చర్యలు చేపట్టేందుకు వాతావరణం సహకరించడం లేదు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన అధికారులు ప్రమాద ప్రాంతాలకు అటు, ఇటూ చేరుకుని సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు.

 

SHARE