దస్త్రాలకు కాళ్లు

90

The bullet news(dress)-మంత్రులు, ఉన్నతాధికారులు ఎన్ని చెప్పినా ‘మా తీరు మాదే.. మా ఇష్టం.. ఎవరయితెనేం మాకు.. మేము చేసేది ఇంతే’ అనే రీతిలో సూళ్లూరుపేట పురపాలక సంఘం కార్యాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్వయానా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహానికి గురై వారం రోజుల కిందట ఓ కమిషనర్‌ గుంటూరులోని డీఎంఏ కార్యాలయానికి సరెండర్‌ అయ్యారు.  ఆ సంఘటన మరవక ముందే అదే కార్యాలయంలోని విలువైన దస్త్రాలను బయటకు తీసుకెళ్లి.. విధుల్లో లేని ఓ అధికారి పాత తేదీల్లో సంతకాలు చేసినట్లు తెలిసింది.

సూళ్లూరుపేట పురపాలక సంఘంలో గతనెలలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించడం.. ప్రధాన రహదారిపై డివైడర్లు అవసరం లేదని చెప్పడం.. ఇందుకు పిలిచిన టెండర్లు రద్దు చేయమనడం.. అధికారులు ఇందుకు భిన్నంగా పనులు ప్రారంభించడం.. ‘ఈనాడు’లో కథనం రావడం.. మంత్రి ఆగ్రహం.. వెంటనే సంబంధిత కమిషనర్‌ను గుంటూరులోని డీఎంఏ కార్యాలయానికి సరెండర్‌ చేయడం విదితమే. ఈ వ్యవహారం జరిగి వారం రోజుల తిరగక మునుపే పురపాలక కార్యాలయంలోని విలువైన దస్త్రాలను పలువురు ఉద్యోగులు బయటకు తీసుకెళ్లారు. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించిన దస్త్రాలతోపాటు, పరిపాలనా విభాగంలోని రికార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని కార్యాలయంలోని ఉద్యోగులు బయటకు తీసుకెళ్లి విధుల్లో లేని ఓ అధికారి వద్దకు చేర్చినట్లు తెలిసింది. నిన్నా, మొన్నా ఆ అధికారి వాటిని పరిశీలించి, పాత తేదీలు వేసి సంతకాలు చేసినట్లు సమాచారం. విధుల్లోకి ఆ అధికారి ఎందుకు సూళ్లూరుపేటకు రావాల్సి వచ్చిందో.. ఆయన వద్దకు కార్యాలయ సిబ్బంది విలువైన దస్త్రాలను ఎందుకు తీసుకుని వెళ్లాల్సి వచ్చిందో తెలియరాలేదు. పురపాలక సంఘంలోని దస్త్రాలను ఎవరైనా సరే
అనుమతి లేకుండా తీసుకుని వెళ్లే అధికారం లేదు. దీంతోపాటు ఏదైనా చేయాలన్న విధుల సమయం ముగిసినప్పటికీ అదనంగా కార్యాలయంలో చేస్తూ ఉద్యోగులు కనిపిస్తుంటారు. సూళ్లూరుపేటలో ఇలాంటి పరిస్థితి లేదు. అంత ఒత్తిడితో పనిచేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ దస్త్రాలను ఎందుకు బయటకు తీసుకెళ్లారో మరి.

ఆ అధికారి ఎందుకు వచ్చినట్లు..?
గతంలో సూళ్లూరుపేట పురపాలక సంఘంలో పనిచేసిన ఓ అధికారి ప్రస్తుతం స్థానికంగా లేరు. ఆయన వేరొక చోట విధులు  నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఆయన  రెండు రోజుల పాటు సూళ్లూరుపేట ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. ఆయన వద్దకు కార్యాలయంలోని సిబ్బంది వివిధ రకాల ఫైళ్లను తీసుకెళ్లారు. వాటిల్లో ఆయన సంతకాలు చేసినట్లు సమాచారం.  దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తే.. పలు వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

గతంలోనూ..
సూళ్లూరుపేట మేజర్‌ పంచాయతీగా ఉన్న సమయంలో విలువైన దస్త్రాలను బయటకు తీసుకెళ్లారు. అందులో కొన్నింటికి ఎలాంటి ఆధారాల్లేకుండా తగులబెట్టిన దాఖలాలు ఉన్నాయి. పురపాలక సంఘం అయిన తర్వాత కూడా తగిన ఆధారాలు లేక  అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లో పంచాయతీ పాలకులు, అధికారుల తప్పిదాలను బయటకు రాకుండా ఉండేందుకు దస్త్రాలు కనిపించకుండా చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలోనే పురపాలక సంఘంలోని విలువైన దస్త్రాలను ఎందుకు బయటకు తీసుకెళ్లారో అర్థం కావడం లేదు. దస్త్రాల్లో సంతకాలే చేశారా.. లేక.. మరేమైనా చేశారన్న అనుమానాలు వస్తున్నాయి. వీటిన్నింటిపై ఉన్నతాధికారులు దృష్టి పెడితే పలు విషయాలు బయట పడగలవు.

SHARE