The bullet news(crime)-తన వివాహేతర సంబంధానికి అడ్డుగా భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించింది. పథకం ప్రకారం విమానంలో వచ్చిన ప్రియుడు హత్య చేసి వెళ్లిపోయాడు. కేసును చేధించిన పోలీసులు సనత్‌నగర్‌ ఠాణాలో గురువారం డీసీపీ సాయిశేఖర్‌, ఏసీపీ గోవర్ధన్‌, ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఫతేనగర్‌ పైపులైను రోడ్డులో నివసించే బిహార్‌కు చెందిన జయమంగళ్‌రాజ్‌(32) జనవరి 31న హత్యకు గురైన విషయం విదితమే. 8 ఏళ్లుగా కుటుంబంతో సహా ఇక్కడే ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య మాలతీదేవి, ముగ్గురు కుమారులున్నారు. నిద్రిస్తున్న అతని గొంతుకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. భార్యపైనే అనుమానాలు రాగా ఆ దిశగా దర్యాప్తు చేయడంతో గుట్టురట్టయింది. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా జయమంగళ్‌రాజ్‌ వద్ద లేఖ లభ్యమైనా, ఒంటిపై గాయాలు ఉండటంతో హత్యగా అనుమానించారు. పోస్టుమార్టం నివేదికలో కూడా హత్యే అని తేలడంతో పరారీలో ఉన్న మాలతీదేవిని పోలీసులు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

హత్యకు దారితీసిందిలా…
జయమంగళ్‌రాజ్‌ సంవత్సరానికోసారి కుటుంబంతో కలిసి స్వగ్రామమైన బిహార్‌లోని ఇబ్రహీంపూర్‌కు వెళ్లి వస్తుంటాడు. మాలతీదేవీకి తన దగ్గరి బంధువైన నీరజ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న జయమంగళ్‌రాజ్‌ మూడు నెలల కిందట భార్యను నగరానికి తీసుకొచ్చి హెచ్చరించాడు.  తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించాలని ప్రియుడితో కలిసి మాలతీదేవి పథకం వేసింది. గత నెల 31వ తేదీ పట్నా నుంచి విమానంలో వచ్చిన నీరజ్‌కుమార్‌ అర్ధరాత్రి జయమంగళ్‌దాస్‌ మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా లేఖ కూడా అతనే రాసి పెట్టాడు. తిరిగి విమానంలో వెళ్లిపోయాడు. ఇరుగుపొరుగు, తోటి కార్మికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాలతీదేవిని అరెస్టు చేశారు. నీరజ్‌కుమార్‌ కోసం బిహార్‌కు ప్రత్యేక బృందాన్ని పంపారు.

SHARE