The Bullet News ( Nellore )_ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షకుల కోసం కార్పోరేషను ఆధ్వర్యంలో ప్రత్యేక వసతులు ఏర్పాట్లు చేస్తున్నామనీ, నగరంలోని అన్నిమసీదుల్లో పవిత్ర వాతావరణం కనిపించేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని నగర మేయరు అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. రంజాన్ పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కార్పోరేషను కౌన్సిల్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కమిషనరు అలీం బాషాతో కలిసి సమావేశంలో వివిధ అంశాలను చర్చించిన అనంతరం మేయరు విలేఖరులతో మాట్లాడారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా నగర వ్యాప్తంగా ఉన్న 115 మసీదుల్లో నిరంతరం మంచినీటి సరఫరా, చల్లటి నీటికోసం కూలర్లు, షామియానాలు, పాలిథీన్ షీట్లను అందజేయనున్నామని తెలిపారు. ప్రతినిత్యం ఉదయం 5 గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా జరిగేలా అధికారులకు ఆదేశాలిచ్చామనీ, మసీదులకు ఎన్టీఆర్ సుజల మంచినీటి కేంద్రాల నుంచి మంచి నీరు సరఫరా అయ్యేలా సూచనలు జారీ చేసామని మేయరు వివరించారు. పారిశుధ్యాన్ని పరిరక్షించేందుకు మసీదులతో పాటు నగరంలోని అన్ని ప్రార్ధనాలయాలకు రెండు పెద్ద చెత్తబుట్టలను అందించి, క్రమం తప్పకుండా వాడేలా భక్తులకు అవగాహన పెంచుతామని మేయరు తెలిపారు. అవసరమున్న మసీదుల్లో అధునాతన స్థాయిలో మరుగుదొడ్లు, స్నానశాలలు నిర్మించి, వసతులను ఆధునీకరిస్తామని మేయరు పేర్కొన్నారు.  నగరంలోని ఏ ప్రాంతంలోనూ విద్యుత్ కోతలకు ఆస్కారం లేకుండా పర్యవేక్షిస్తూ, అవసరమున్నచోట కొత్త విద్యుత్ బల్బుల ఏర్పాటు, ప్రతీ మసీదు ముందు ఎక్కువ కాంతివంతమైన లైట్లను అమర్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. రంజాన్ పండుగ సందర్భంగా చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం అందించే ‘చంద్రన్న రంజాన్ తోఫా’ సరుకులను అర్హులందరికీ అందించేందుకు కృషి చెయ్యాలని ముస్లిం నాయకులను మేయరు కోరారు. పండుగ సందర్భంగా నగరంలోని మసీదుల్లో విధులు నిర్వర్తిస్తోన్న మత పెద్దలైన ఇమాం, మౌజన్లకు ఇంటి నివేశనా స్థలాలను ప్రభుత్వం నుంచి ఉచితంగా అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసామని మేయరు ప్రకటించారు. ప్రార్ధనా సమయాల్లో ట్రాఫిక్కు మళ్లింపు, పార్కింగు లాంటి సమస్యలను పోలీసు శాఖవారు జాగ్రత్తగా పర్యవేక్షించాలని మేయరు సూచించారు. ఈ సమావేశంలో సిటి సిఐ సుధాకర్ రెడ్డి, 1వ పట్టణం సిఐ అబ్దుల్ సుభహాన్, విద్యుత్ శాఖ ఏడిఈ కెఎస్ బెనర్జీ, కార్పోరేషను అధికారులు రవికృష్ణంరాజు, పాయసం వెంకటేశ్వర్లు, డాక్టర్ సుబ్బరాజు, రాజేంద్ర ప్రసాద్, మతపెద్దలు అబూబకర్, నాయకులు నన్నే సాహెబ్, మొయునుద్దీన్, ఖాజావలి, షంషుద్దీన్, మౌలానా, జియా ఉల్ హక్, జాకీర్, జంషీద్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.

SHARE