సీఎం ఆలోచనలతో ముంగిట్లో రవాణాశాఖ

78

The Bullet News _ Nellore

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో జిల్లా రవాణా శాఖ చేపట్టిన ‘మీ ముంగిట్లో రవాణా శాఖ’ సేవలను వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకుని, తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని నగర మేయరు అబ్దుల్ అజీజ్ సూచించారు. జిల్లా రవాణా శాఖ, నెల్లూరు జిల్లా టు వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషనుల సంయుక్తాధ్వర్యంలో స్థానిక మద్రాసు బస్టాండు సమీపంలోని రెడ్ క్రాస్ కార్యాలయ ప్రాంగణంలో ఎల్.ఎల్.ఆర్ మేళాను శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మేయరు, మేళాలో ప్రజలకు అందుతున్న సేవలను పర్యవేక్షించి, అర్హులకు ఎల్.ఎల్.ఆర్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రవాణా కార్యాలయం ద్వారా సాధారణంగా డ్రైవింగ్ లైసెన్సు అందుకునేందుకు ఎక్కువ సమయం కావడం, అదేవిధంగా రవాణా కార్యాలయాలు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేని కారణంగా ఎక్కువ శాతం ప్రజలు లైసెన్సులు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. లైసెన్సులేని వారు వాహనాలు నడుపుతూ రహదారి ప్రమాదాల్లో మరణిస్తే కనీసం ఇన్సూరెన్సు నిధులు కూడా అందక కుటుంబ సభ్యులు దిక్కులేని వారవుతున్నారని మేయరు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను గుర్తించిన ప్రభుత్వం, రవాణా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 160 మేజరు పంచాయితీల్లో మేళాలను నిర్వహించి 30 వేల మందికి నూతనంగా లైసెన్సులు అందజేశారని తెలిపారు. ఎల్.ఎల్.ఆర్ మేళాల్లో అర్హులకు రహదారి భద్రతా సూచనలు, వాహనం నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ధ్రువీకరణ పత్రాలను అందించడం అభినందనీయం అని రవాణా శాఖ అధికారులను మేయరు ప్రశంసించారు. నగరంలో సుమారు 4 లక్షల ద్విచక్ర వాహనాలకు కేవలం 1.70వేల డ్రైవింగ్ లైసెన్సులు, 1.25 వేల కార్లకు 75 వేల లైసెన్సులు మాత్రమే ఉన్నట్టు అధికారులు చూపుతున్న గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయనీ, ఊహించని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని వాహన చోదకులంతా లైసెన్సులు పొందాలని మేయరు కోరారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ డిటిసి శివరాం ప్రసాద్, టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి నన్నేసాహెబ్, కార్పొరేటరు రాజానాయుడు, అధికారులు మహమ్మద్ రఫీ, పూర్ణ చంద్ర రావు, శ్రీనివాసరావు, సౌజన్య, మెకానిక్స్ అసోసియేషను నిర్వాహకులు బద్రుద్దీన్, కాంతం, నజీర్ ఖాన్, అన్వర్ బాషా, షాజహాన్, జలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 

SHARE