ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మావోయిస్టుల హెచ్చరిక

514

The bullet news :-  అరుకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై మావోయిస్టుల దుశ్చర్య మరిచిపోకముందే.. మరో సంఘటన కలకలం రేపింది.. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని మావోయిస్టులు తీవ్రంగా హెచ్చరిస్తూ లేఖ రాశారు. అధికార పార్టీకి తొత్తుగా మారారని, 20 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయారని లేఖలో ఆరోపించారు. అలాంటి ఆమె తమకు నీతులు చెపుతారా అని ప్రశ్నించారు. ప్రజా కోర్టు సందర్భంగా ఈశ్వరి గురించి కిడారి చెప్పారని.. ఆమెకు అందిన నగదుని 2 నెలల్లోల గిరిజనులకు పంచేసి క్షమాపణలు చెప్పాలని మావోయిస్టులు డిమాండ్‌ చేశారు. లేదంటే కిడారి సర్వేశ్వరావు, సివేరి సోమలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

మరోవైపు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యపైనా వివరణ ఇచ్చారు లేఖలో.. కిడారి, సోమలు.. గిరిజన వ్యతిరేకులని, ప్రజా ద్రోహులుగా ఆ లేఖలో విమర్శించారు. ఈ కారణంగానే వారిని ప్రజాకోర్టులో శిక్షించామని పేర్కొన్నారు. గూడ క్వారీని వదిలేయాలని చాలాసార్లు కిడారిని హెచ్చరించామని, అయినా, ఆయన పట్టించుకోలేదని గుర్తు చేశారు. అలాగే బాక్సైట్‌ తవ్వకాలకు లోపాయికారీగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని.. అందుకే ప్రజాకోర్టులో శిక్షించామని ఆ లేఖలో పేర్కొన్నారు. వారిద్దరికి రక్షణగా వచ్చిన ఉద్యోగులను మానవతా దృక్పథంతో వదిలిపెట్టామని, ఆయుధాలతో చిక్కినా చంపలేదన్నారు. అలా మావోయిస్టులు దొరికితే పోలీసులు వదిలిపెడతారా అంటూ లేఖలో ప్రశ్నించారు.