నెల్లూరు గ్రామీణ తహసీల్దారు సస్పెండ్‌….జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు

312

ఎవరో.. జ్వాలను రగిలించారు.. వేరెవరో దానికి బలి అయ్యారు… అనే సామెతలా.. నెల్లూరు రూరల్ తహసీల్దారు పరిస్థితి తయారైంది.
కుల ధ్రువీకరణ పత్రాల జారీలో కిందిస్థాయి సిబ్బంది అక్రమాలకు పాల్పడి.. వారి లాగిన్ నుంచి తహసీల్దారు కి పంపారు. ఆయన కూడా పరిశీలించి సర్టిఫికేట్ ఇవ్వకుండా.. ఇచ్చేయడంతో చివరకు ఆయనే బలైన వైనం ఇది.

తన అధికార పరిధిలోలేని కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంతో నెల్లూరు గ్రామీణ తహసీల్దారు నిర్మలానందబాబాను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు శుక్రవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌(ఎస్సీ)లోని చెంబన్‌, మూచీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో గత కొన్నేళ్లుగా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆయా కులాలకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలంటే ఆర్డీవో స్వయంగా విచారణ చేపట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇటీవల నెల్లూరు గ్రామీణం నియోజకవర్గంలోని కొందరికి చెంబన్‌, మూచీ కుల ధ్రువీకరణ పత్రాలను నిర్మలానందబాబా జారీ చేశారు. ఆ విషయమై కొందరు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ను విచారణకు ఆదేశించారు. ఆయన విచారణలో ఆయా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు నిర్థారణ కావడంతోపాటు..వాటిని జారీ చేసే అధికారం కూడా ఆయనకు లేని విషయం తెలిసికూడా ఉద్దేశపూర్వకంగా జారీ చేసినట్లు నిర్థారించారు. దాంతో శుక్రవారం అర్థరాత్రి ఆయన్ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వాస్తవానికి.. ఆయా సర్టిఫికేట్ల వ్యవహారంలో ఆ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఆపరేటర్ల అక్రమాల వల్ల… అధికారి బలి అయ్యారని అక్కడి కొందరు ఉద్యోగులు అంటున్నారు.
ఆ ఇద్దరు అపరేటర్లపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అది నిత్యకృత్యంగా మారింది. ఈ విషయంలో RDO, జిల్లా కలెక్టర్ దృస్థి సారిస్తే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.