ఉత్తమ ఫలితాలకు కేరాఫ్ మునిసిపల్ కాలేజి – మేయర్ అబ్దుల్ అజీజ్

57

The Bullet News ( Nellore ) _
ప్రతిభ కలిగిన పేద విద్యార్ధినుల ఉజ్వల భవిషత్తుకై కార్పోరేషను ఆధ్వర్యంలో ప్రారంభించిన పిఎన్ఎం మున్సిపల్ జూనియర్ కళాశాల వారాంతపు పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి ఆశయాలకు అనుగుణంగా నడుస్తోందని నగర మేయరు అబ్దుల్ అజీజ్ సంతోషం వ్యక్తం చేసారు. స్థానిక జెండావీది పిఎన్ఎం మహిళా జూనియర్ డే స్కాలర్స్ కళాశాల విద్యార్ధినులకు మద్యాహ్న భోజన పధకాన్ని మేయరు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో ప్రస్తుతం 46మంది విద్యార్ధినులు రెండు విభాగాల్లో అడ్మిషన్లు పూర్తీ చేసుకుని వారాంతపు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చాటుతున్నారనీ, అందులో సాధారణ గ్రేడ్ తెచ్చుకున్న ఇద్దరు విద్యార్ధినులు సంచలనం సృష్టిస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రధమంగా నిలిచారని పేర్కొన్నారు. విద్యార్ధినులకు అవసరమైన అన్ని మౌళిక వసతులనూ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కళాశాలలో కల్పిస్తూ, మద్యాహ్న భోజనం, యూనిఫాంలను ఉచితంగా అందిస్తున్నామని మేయరు తెలిపారు. అత్యంత పౌష్టికాహారం, రుచీ, శుచీ, శుభ్రతల్లో ఏమాత్రం రాజీ పడకుండా నాణ్యమైన భోజనం ప్రతిరోజూ అందిస్తామని మేయరు వెల్లడించారు. ఎక్కువగా నిరుపేద ముస్లింలు ఉన్న ఈ ప్రాంతంలో పదవ తరగతి తర్వాత ఉన్నత విద్యకు అత్యధికంగా బాలికలు దూరమవుతున్నారనీ, అలాంటి కుటుంబాల సంప్రదాయ విలువలను గౌరవిస్తూ బాలికలకు ప్రత్యేక కళాశాల ఆవశ్యకతను గుర్తించి కాలేజి ఏర్పాటు చేసామని ఆయన వెల్లడించారు. కళాశాల ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నందున విద్యార్ధుల విలువైన విద్యాసంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూల్లోని అదనపు తరగతి గదులలో తాత్కాలికంగా తరగతులను నడుపుతున్నట్లు మేయరు వివరించారు. ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు అందుకున్న మున్సిపల్ రెసిడెన్షియల్ కళాశాలను ఆదర్శంగా తీసుకుని మహిళా కళాశాలలో ఉత్తమ విలువలతో కూడిన వసతులను కల్పిస్తున్నామని మేయరు తెలిపారు. నారాయణ విద్యాసంస్థల మెటీరియల్, పరీక్షా పద్ధతులు, విద్యా బోధనా విధానం, తరగతుల నిర్వహణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటరు ల్యాబులు, నిపుణులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో తరగతులను నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మైనార్టీ అధ్యక్షులు మొయునుద్దీన్, నాయకులు నన్నేసాహేబ్, మున్వర్, షంషుద్దీన్, మౌలానా, హయత్ బాబా, సాబీర్ ఖాన్, పాషా మొహిద్దీన్, స్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, కళాశాల అధ్యాపక సిబ్బంది పూర్ణిమ, రాజేశ్వరి, కల్యాణి, విజయకుమారి, శాంతారాం, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

SHARE