లోకేష్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు

87

THE BULLET NEWS (GUNTUR)-ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటూ వచ్చిన జనసేనాని.. తొలిసారి చంద్రబాబు పై, ఆయన తనయుడు లోకేశ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రపదేశ్‌లో అవినీతిలో అగ్రస్థానంలో ఉందన్న పవన్.. లోకేశ్‌ చేస్తున్న అవినీతి గురించి చంద్రబాబుకు తెలుసా అంటూ సూటిగా ప్రశ్నించారు. లోకేశ్‌పై జనసేన అధ్యక్షుడు చేసిన ఈ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అటు ఇసుక మాఫియాలో, దుర్గగుడి పార్కింగ్‌లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాటాలు తీసుకుంటున్నారని విమర్శించారు. భూమిని తోడేస్తున్నారని, భూతల్లి వారందర్నీ తనలోకి లాగేసుకుంటుందని కూడా శపించారు. రాష్ట్రాన్ని పాలించాలంటే పెట్టి పుట్టాలా అని ప్రశ్నించడం, చంద్రబాబు, లోకేశ్‌ను టార్గెట్ చేసుకోవడం ద్వారా తన రాజకీయ వ్యూహాన్ని పార్టీ ఆవిర్భావ సభ సాక్షిగా బయటపెట్టారు పవన్ కళ్యాణ్‌. ఓటుకు నోటు కేసును, అమరావతికి భూసమీకరణను ప్రస్తావించిన ఆయన.. రాష్ట్రంలో సాగుతున్న అవినీతి వల్లే ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదన్నారు. తాను ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే, ప్రత్యేక ప్యాకేజీ పేరిట చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారంటూ మండిపడ్డారు. హోదా కోసం ఇప్పటికైనా ఆమరణ దీక్షకు సిద్ధమని ప్రకటించారు పవన్.

SHARE