మాతో పాటు మీరు కూడా కలిసిరండి..- సేవా సంస్థల నిర్వహకులతో మేయర్

82

The Bullet News ( Nellore)_ పెరుగుతున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషను ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామనీ, వీటికి తోడు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలను బాధ్యతగా భావించి నిర్వహించాలని నగర మేయరు అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. ‘జనం కోసం మనం’ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోటమిట్ట ప్రాంతం మహాలక్ష్మమ్మ గుడి వీధిలో శనివారం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని మేయరు ప్రారంభించారు. ఈ సందర్భంగా మజ్జిగను పంపిణీ చేసిన అనంతరం మేయరు మాట్లాడుతూ సాధారణ విద్యార్ధులంతా కలిసి సమాజ సేవ చేయాలన్న ఉన్నత ఆశయంతో నగరంలో వివిధ సేవాకార్యక్రమాలు చేపడుతున్నారని సంస్థ నిర్వాహకులను ప్రశంసించారు. జనం కోసం మనం సంస్థ ద్వారా గత రెండేళ్లుగా రక్తదాన, వైద్య శిబిరాలు, వ్యాధులపై అవగాహన సదస్సుల నిర్వహణ, పేద పిల్లలకు పుస్తకాల పంపిణీ వంటి పనులను బాధ్యతగా నిర్వహిస్తోన్నారని మేయరు కొనియాడారు. వీరి సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని నగరంలోని అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కార్యక్రమాలు చేపట్టాలనీ, వ్యాపార, వాణిజ్య కేంద్రాల నిర్వాహకులూ, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయ సిబ్బంది తమ ప్రాంగణాల్లో మంచినీటి వసతిని ఏర్పాటు చేసి ప్రజలు వేసవిలో వడదెబ్బకు గురికాకుండా శ్రద్ధ వహించాలని మేయరు విజ్ఞప్తి చేశారు. జిల్లా నలువైపుల నుంచి ప్రజలు విచ్చేసే ప్రధాన కూడళ్ళతో పాటు అన్ని డివిజనుల్లో కార్పోరేషను ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహణా బాధ్యతలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామని మేయరు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజానాయుడు, మొయునుద్దీన్, జాకీర్, శరత్ చంద్ర, టోనీ బాబు, సేవాసంస్థ సభ్యులు హుస్సేన్, బాజీ, వికాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు

SHARE