ప్రిన్సిపల్‌ హర్షిత వేధింపులు భరించలేకున్నాం

86

The bullet news (Sitharamapuram)_ సీతారామపురం ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ సీహెచ్‌.హర్షిత వేధింపులు భరించలేకున్నామంటూ పలువురు బాలికలు తమ వార్డెన్‌తో కలిసి సోమవారం కలెక్టరేట్‌లోని జేసీ వెట్రి సెల్వికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు కాస్మోటిక్స్‌ చార్జీలు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఫ్యాషన్‌ డిజైన్, యానిమేషన్‌కు సంబంధించిన టూర్‌ నగదును కూడా తినేసిందని తెలిపారు. యూనిఫాం కోసం తాము ప్రిన్సిపల్‌కు నగదు చెల్లించామన్నారు. అయినా యూనిఫాం ఇచ్చే ఏర్పాట్లు చేయలేదన్నారు.

ఈ విషయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే అమ్మాయిలమని కూడా చూడకుండా అబ్బాయిల ముందే కొడుతుందని వాపోయారు. తాము పట్టీలు వేసుకున్నా.. వేలికి రింగ్‌ పెట్టుకున్నా.. తలపై పూలు పెట్టుకున్నా.. మంచి బట్టలు వేసుకున్నా ఓర్చు కోలేదని, ఎవరి కోసం మంటూ మాటలతో వేధిస్తుందన్నారు. తమ ప్రిన్సిపల్‌ను మార్చాలని కోరారు. లేదంటే తమకు చదువు మానేయక తప్పదన్నారు. దీనికి స్పందించిన జేసీ వెట్రి సెల్వి విచారించి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. వార్డెన్‌ ఎం.సుచరిత వెంట అమూల్య, రాజి, శ్రీలేఖ పలువురు విద్యార్థినిలు పాల్గొన్నారు.

SHARE