పీఎస్‌ఎల్‌వీ-సి41 విజయవంతం

139

The bullet news (Sulurpeta)_ ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఉద్దేశించిన పీఎస్‌ఎల్‌వీ-సి41 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి గురువారం వేకువజామున 4.04 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. 32 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 19.19 నిమిషాల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు దశల అనంతరం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహం నిర్ణయించిన సమయానికి విడిపోయి కక్ష్యలోకి ప్రవేశించింది. దీని బరువు 1425 కిలోలు. ఈ ఉపగ్రహం ద్వారా దేశ దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

ఇప్పటి వరకు ఇస్రో 8 నావిగేషన్‌ శాటిలైట్లను నింగిలోకి పంపింది. ఇందులో గతేడాది ఆగస్టు 31న పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ ఉపగ్రహం ఉష్ణ కవచం తెరుచుకోకపోవడంతో బయటకు రాలేదు. దాంతో విఫలమైనట్లు ఇస్రో ప్రకటించింది. దాని స్థానంలో గురువారం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహాన్ని పంపారు.

తీరానికి దూరంగా రోజుల తరబడి సముద్రంలో చేపలవేట సాగించే మత్స్యకారులకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా కీలక సేవలు అందించడానికి ఇస్రో నడుంబిగించింది. ఇందుకోసం ఇప్పటికే సిగ్నల్‌ రిసీవర్లను తమిళనాడు, కేరళలో పడవలపై పరీక్షించింది. బ్లూటూత్‌ ద్వారా మత్స్యకారుల ఫోన్లకు ఈ రిసీవర్లను అనుసంధానిస్తున్నారు. సముద్రంలో నిర్దిష్టంగా ఎక్కడ ఉన్నారన్నదానిపై టెక్స్ట్‌ సందేశాన్ని ఇది అందిస్తుంది. వాతావరణ హెచ్చరికలూ చేస్తుంది. ఇందుకోసం ఒక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సెల్‌ఫోన్లలోనే అంతర్గతంగా ఈ రిసీవర్లను ఏర్పాటు చేసేందుకు మొబైల్‌ ఫోన్‌ తయారీదారులతో ఇస్రో మాట్లాడుతోంది. వీటిని వాహనాల్లో దిక్సూచి సాధనంగానూ ఉపయోగించుకోవచ్చు.

SHARE