నెలరోజుల్లో ఒజోనేటేడ్ సురక్షిత మంచి నీరు సరఫరా

95

The bullet news ( Nellore ) _ అంతర్జాతీయ స్థాయి ఒజోనేటేడ్ వాటర్ సాంకేతిక విధానంతో మరో నెలరోజుల్లో సమ్మర్ స్టోరేజు ట్యాంకు ద్వారా ప్రజలకు అత్యంత సురక్షిత మంచినీటిని అందజేస్తామని నగర మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. స్థానిక కొత్తూరు ప్రాంతంలోని సమ్మర్ స్టోరేజు ట్యాంకును కార్పోరేటరులతో కలిసి మేయరు ఆదివారం పరిశీలించారు. చెన్నైకి చెందిన ఒజోనేటేడ్ కంపెనీ ప్రతినిధులతో కలిసి దశలవారీగా రసాయనాలతో నీటికి పరీక్షలు జరిపారు. నీటి నాణ్యతను ఆయన ప్రత్యక్షంగా పరిశీలింఛి సంతృప్తిని వ్యక్తం చేసారు. అనంతరం విలేఖరులతో మేయరు మాట్లాడుతూ కార్పోరేషను ద్వారా నగర ప్రజలకు స్వచ్చమైన సురక్షిత మంచినీటిని అందించడం తమ ప్రధాన బాధ్యత అని తెలిపారు. చెరువునీటిలో సాంద్రత పెరిగి శుద్ధి చేసిన నీరు రంగుతో పాటు ప్రత్యేక రుచి కలిగి కాస్త వాసన వస్తోందని పేర్కొన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు నూతనంగా యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ సాంకేతికతను అమలు చేయబోతున్నామని ఆయన వివరించారు. నీటి శుద్ధికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న క్లోరినేషన్ విధానానికన్నావందరెట్ల సామర్ధ్యంతో నీటిని శుద్ధి చేసే ఒజోనేటేడ్ వాటర్ సాంకేతికతను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అంతర్జాతీయ స్థాయి నాణ్యత ఉండే ఒజోనేటేడ్ వాటర్ విధానం ఇప్పటివరకు దేశంలోని ఏ కార్పోరేషనూ అమలు చెయ్యలేదనీ, తొలిసారి నగరంలో ఈ సాంకేతికతను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రజలకు అందిస్తున్న మంచి నీటిలో రంగు, వాసన, సూక్ష్మ మలినాలు, బ్యాక్టీరియా వంటి మూలకాలను పూర్తిగా తొలగించి స్వచ్చమైన, సురక్షితమైన నీటిని అందించేందుకు శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో పరీక్షలు జరిపిస్తున్నామని మేయరు వెల్లడించారు. ఫలితాలను విశ్లేషించుకుని నెలరోజుల్లో సమ్మర్ స్టోరేజు ట్యాంకునుంచి నూతన విధానాలతో సురక్షిత మంచినీటిని అందించేలా అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. సమ్మర్ స్టోరేజు ట్యాంకులో నీటి పరీక్షలు నిర్వహించే ల్యాబ్ ను ఆధునీకరించి, ఇద్దరు ల్యాబ్ నిర్వాహకులను నూతనంగా నియమిస్తామని మేయరు చెప్పారు. ట్యాంకు వద్ద జరిపే పరీక్షలే కాకుండా ఇళ్ళకు నీరు సరఫరా అయ్యేంతవరకూ మధ్యలో ఉన్న అన్ని దశల్లో నిత్యం పరీక్షలు నిర్వహించి ఫలితాలను ఆన్లయిన్ ద్వారా ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి నన్నేసాహేబ్, కార్పొరేటర్లు రాజా నాయుడు, బొల్లినేని శ్రీవిద్య, మేకల రజని, మన్నెం పెంచల నాయుడు, నాయకులు షంషుద్దీన్, జంషీద్, నగర పాలక సంస్థ అధికారులు షరీఫ్, లక్ష్మణమూర్తి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్వహణా సిబ్బంది పాల్గొన్నారు.

SHARE