రోడ్డు పక్కనే పక్కా మోసం

137

The bullet news(crime)-

  • లాటరీ పేరుతో జేబుకు చిల్లు
  • ఆశకు పోయి బలవుతున్న అమాయకులు
‘పక్కా పల్లెటూరు యువకుడు. పిల్లోడికి బాగాలేదని పిడుగురాళ్ల ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఇడ్లీ తీసుకొద్దామని పక్కనే ఉన్న సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ రోడ్డు పక్కన లాటరీ జరుగుతోంది. రూ.20 పెట్టి టిక్కెట్‌ కొంటే విలువైన వస్తువులు వస్తాయని ఆశపడ్డాడు. అలా టిక్కెట్లు కొంటూనే ఉన్నాడు. గంటల వ్యవధిలో చేతిలో ఉన్న ఐదు వేలూ పోయాయి. జేబు ఖాళీ అయ్యాక వచ్చిన పని గుర్తొచ్చింది. పరుగెత్తుకుంటూ ఆసుపత్రికి వెళ్తే అప్పటికే బిడ్డ చనిపోయాడని తెలిసి చతికిలపడ్డాడు.’
పిడుగురాళ్ల, పిడుగురాళ్ల రూరల్‌: అద్దంకి-నార్కెట్‌పల్లి హైవే పక్కన ఉన్న పిడుగురాళ్లలో ఇలా ఘరానా మోసం జరుగుతోంది. పట్టణంలోని జయలక్ష్మీ హాలు సెంటర్‌లో లాటరీ పేరుతో రేయింబవళ్లు అమాయకుల జేబుకు చిల్లు పడుతోంది. బొత్తిగా చదువుకోని వ్యక్తి తెలివితేటలను ఉపయోగించి ఎంతో మందిని అలవోకగా మోసగిస్తున్న వైనం సోమవారం వెలుగు చూసింది. విలువైన వస్తువులు వస్తా యంటూ ఆశ చూపి, ముగ్గులోకి దింపి ఉన్నదంతా దోచుకుంటున్నారు.
మొత్తం ఆరు సెట్లు !
ఈ లాటరీలో మొత్తం 6 సెట్లు ఉంటాయి. ఒక్కో సెట్టు(టిక్కెట్లు) విలువ రూ.100. ఒక్కో ఆటకు ఆరుగురికి అవకాశం దొరుకుతుంది. ఆరుఈ గురిలో నలుగురు లాటరీ నిర్వహించే వ్యక్తికి సంబంధించిన మనుషులు. మిగిలిన ఇద్దరు కొత్తవాళ్లు. ఈ విషయం తెలియని అమాయకులు రూ.100 ఇచ్చి టిక్కెట్లు కొంటారు. ఆరు సెట్లు పూర్తయ్యాక లాటరీ తీస్తారు. అప్పుడు చూస్తే విలువైన వస్తువులన్నీ లాటరీ నిర్వహించే వ్యక్తికి సంబంధించిన ఆ నలుగురికే వస్తాయి. ఇదంతా కూడా పక్కా మోసం. వారి మనుషులను మార్చి మార్చి తీసుకొచ్చి జనంలో నిలబెట్టి లాటరీ తీయిస్తూ ఉంటారు.
ఒక్కసారి వెళ్తే.. గుల్లయినట్టే
ఆటాడే వారిలో లాటరీ వ్యక్తికి సంబంధించిన మనుషులు ఉన్నారని తెలియక కొందరు ఈ ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. రూ.100 కదా అని ఆటలోకి దిగుతున్నారు. తీరా దిగాక పోయిన వాటిని సంపాదించుకోవాలన్న ఆశతో మరింత పోగొట్టుకుంటున్నారు. సున్నం బట్టీలు, క్వారీలు, మరికొన్ని చిన్నచిన్న వ్యాపార సంస్థల్లో పనులు చేసుకుని జీవించేవారు సినిమాకని, టిఫిన్‌ చేయడానికని ఆ సెంటర్‌కు వచ్చి రోజువారీ కష్టార్జితాన్ని ఈ లాటరీ నిర్వహించే వ్యక్తి చేతుల్లో పోసిపోతున్నారు.
రోజుకు రూ.50వే ల వ్యాపారం
అక్కడ చూడటానికి చిన్నచిన్న బిందెలు, తపాలాలు మాత్రమే కనిపిస్తాయి. వాటిని చూసి ఎవరైనా వీళ్లదేముందిలే అనుకుం టారు. ఆ చిన్నచిన్న బిందెలు, తపాలాల వెనుక భారీ వ్యాపారమే జరుగుతోంది. రోజుకు సుమారుగా రూ.50 వేల వరకు ఈ లాటరీ వ్యక్తి సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకనైనా, పోలీసు అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
SHARE