ప్రేమకోసం..ప్రాణ త్యాగం

57

The bullet news(rolugunta)-  ప్రేమ ఎంత మధురమో.. అంత కఠినం.. మనసు పడ్డ మనిషిని అందుకోలేకపోతే బతుకు వృథా అనిపిస్తుంది.. అందుకే బతుకంతా ఆనందంగా గడపాల్సిన జంట ఊరు కాని ఊరిలో ఆనందపురం మండలంలోని గుడిలోవ విజ్ఞాన విహార పాఠశాలకు సమీపంలోని జీడి తోటలలో విగత జీవులుగా మిగిలారు. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన యర్రంశెట్టి హరిబాబు అలియాస్‌ శ్రీను (32), బంటు రేవతి (28)ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హరిబాబు ఇంటర్‌ వరకు చదువుకున్నాడు. రేవతి డీ ఫార్మశీ చేసింది. ఎం ఫార్మశీ చదువుతూ.. నర్సీపట్నంలోని ఒక మెడికల్‌ షాపులో నాలుగేళ్ల నుంచి పనిచేస్తోంది. ఇద్దరూ ప్రతి రోజు కలుసుకునేవారు. వారిది ఒకే సామాజికవర్గం. అంతేకాక ఇరు కుటుంబాలకు బంధుత్వం ఉంది. వారి ప్రేమ విషయం తెలిసిన శ్రీను తల్లిదండ్రులు రేవతి పెద్దల వద్దకు వెళ్లి పెళ్లి విషయం మాట్లాడారు. చదువు తక్కువని, చిన్న ఉద్యోగమని వారు నిరాకరించారు. దాంతో గతేడాది శ్రీను తల్లిదండ్రులు కోటవురట్ల మండలం కలవలపూడి గ్రామానికి చెందిన యువతితో వివాహం చేశారు.                                                                                                                              పెళ్లి జరిగినా శ్రీను రేవతిని మరచిపోలేకపోయాడు. వారి మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఇది వారి కుటుంబాల్లో ఘర్షణకు దారి తీసినట్టు సమాచారం. దీంతో కలిసి జీవించలేమని ఒక నిర్ణయానికి వచ్చిన ప్రేమికులు చనిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఈనెల 17న శ్రీను నర్సీపట్నంలో రేవతి పనిచేస్తున్న మెడికల్‌ షాపు వద్దకు వెళ్లి ఆమెను మోటార్‌బైక్‌పై ఎక్కించుకొని వెళ్లాడు. రెండు రోజులైనా వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ నెల 19న నర్సీపట్నం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా గుడిలోవ కొండ ప్రాంతంలోని జీడి తోటలో ఇద్దరు యువతీ యువకులు ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉండడాన్ని గమనించిన పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ ఆర్‌.గోవిందరావు, ఎస్‌ఐ గణేష్, డీటీ ప్రసాద్‌ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. అక్కడ లభ్యమైన బ్యాగ్‌లోని గుర్తింపు కార్డుల ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇరువురి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని శ్రీను, రేవతిలుగా గుర్తించారు. వారి మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని ఇద్దరి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. సీఐ ఆర్‌.గోవిందరావు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.                    మృతదేహాలు లభ్యమైన జీడి తోటల్లోనే మృతుడి బైక్, మృతురాలి హ్యాండ్‌ బ్యాగ్‌ లభ్యమయ్యాయి. ప్రియురాలి చున్నీతో శ్రీను ఉరి వేసుకోగా.. రేవతి మృతదేహం మాత్రం నేలపై పడివుంది. ఆమె ఏ విధంగా మరణించిందో తెలియరాలేదు. ఇద్దరి మృతదేహాలు బాగా ఉబ్బి ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడి మూడు రోజులై ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలంలో కూల్‌ డ్రింక్‌ బాటిళ్లు, చిప్స్‌ ప్యాకెట్లు లభించాయి.

తమ మృతదేహాలను ఒకే దగ్గర దహనం చేయాలని మృతులు ఫోన్‌లో వారి స్నేహితులకు, బంధువులకు సంక్షిప్త సందేశం పంపినట్టు తెలుస్తోంది. వీరి మరణాలతో ఇరువురి తల్లిదండ్రులు, స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎంతో ప్రేమానుబంధాలతో జీవితం సాగించాల్సిన ప్రేమికులు విగత జీవులుగా మారడం గ్రామస్తులను సైతం కంట తడి పెట్టిస్తోంది.

 

SHARE