నెల్లూరు సింహపురి లో న్యూరో మానిటరింగ్ ద్వారా సేఫ్ స్పైన్ సర్జరీ

125

The bullet news ( Nellore ) _ సింహపురి హాస్పిటల్స్ లో మొట్టమొదటిసారి న్యూరో మానిటరింగ్ ద్వారా సేఫ్ స్పైన్ సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పిటల్స్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డా.టి.గోపాల కృష్ణయ్య వెల్లడించారు. ఆదివారం హాస్పిటల్స్ లోని ఆడిటోరియంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన కేసు పూర్వపరాలను వెల్లడించారు. కడప జిల్లా పులివెందులకు చెందిన రాజశేఖర్ రెడ్డి, రాజేశ్వరి ల కుమార్తె లలిత(12) ను వెన్నుపూస 110 డిగ్రీలు వంగిపోయిన స్థితిలో  తమవద్దకు వచ్చిందన్నారు. పాపకు పుట్టినప్పుడు బాగానే ఉన్నా, గత రెండు సంవత్సరాలుగా వెన్నుపూస వంగిపోతూ వచ్చిందని, వ్యాధి చాలా త్వరగా పురోగతి చెందడంతో గుర్తించే సమయానికి 110 డిగ్రీలు వంగిపోయిందన్నారు. ఈ స్థితిలో గనుక పాపకు ఆపరేషన్ నిర్వహించకపోతే, ఊపిరితిత్తులు, గుండె మరియు వెన్నుపాము పై ఒత్తిడి పెరిగిపోయి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ స్థితిలో వెన్నుపూసపై తీవ్ర ఒత్తిడి ఉండడం వల్ల ఆపరేషన్ జరిగే సమయంలో కాళ్ళు చచ్చుబడిపోవడం, మల మూత్ర విసర్జన చేయలేకపోవడం మొదలగు సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇటువంటి సమస్యలు నివారించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన “ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్” ద్వారా ప్రప్రథమంగా సింహపురి హాస్పిటల్స్ నందు  ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ టెక్నాలజీతో ఆపరేషన్ చేయడం వల్ల నరాలు మరియు వెన్నుపూస యొక్క పనితీరుని ప్రత్యక్షంగా న్యూరో మానిటరింగ్ ద్వారా గమనించవచ్చని, ఎటువంటి చిన్న సమస్య తలెత్తినా వెనువెంటనే తగిన జాగ్రత్త తీసుకుని, వైద్యులు కూడా ధైర్యంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఈ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పాపకు 110 డిగ్రీల వంకర ఉన్నప్పటికీ, దానిని 85 శాతం సాధారణ స్థితికి తీసుకురావడం జరిగిందన్నారు. నడుము ఆపరేషన్ జరిగేటప్పుడు కాళ్లలో చచ్చు వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సంక్లిష్టమైన ఆపరేషన్లు ఎంతో విజయవంతంగా చేయవచ్చన్నారు. సింహపురి హాస్పిటల్స్ లో ఇటువంటి సదుపాయాలు అందుబాటులో ఉండబట్టే సంక్లిష్టమైన సర్జరీలు విజయవంతంగా చేయగలుగుతున్నామన్నారు. కాబట్టి గూని సంబంధిత సమస్యలతో బాధపడేవారు తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ శస్త్ర చికిత్సకు సహకరించిన మత్తు వైద్య నిపుణులు డా.రంగనాథ్ కు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పేషెంట్ లలిత, ఆమె తల్లిదండ్రులు పాల్గొన్నారు.

SHARE