భాగ్యనగరం లో సెల్ఫీ స్పాట్…

43

THE BULLET NEWS (HYDERABAD)-ఒకప్పుడు ఆ ప్రదేశం చెత్త చెదారంతో నిరూపయోగంగా ఉండేది… అటు వైపు నడవాలంటేనే ఇబ్బందిపడాల్సిన పరిస్థితి.. మరి ఇప్పుడు ఆ ప్రదేశాన్ని చూస్తే చాలు… కళ్లను కట్టిపడేలాచేస్తోంది. రోడ్డు పక్కన నడిచేవాళ్లే కాదు… వాహనదారులను సైతం చూపు మరల్చుకోనీకుండా చేస్తోంది.

హైదరాబాద్‌‌లో సెల్ఫీ స్పాట్ అంటే టక్కున గుర్తొచ్చేది లవ్ హైదరాబాద్. ఇప్పుడు ఆ ఖాతాలో రోజ్ ఫౌంటెన్ కూడా చేరిపోయింది. ఇప్పటి వరకూ ఒక లెక్క ఇక నుంచీ మరో లెక్క అన్నట్లు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. అసలు ఈ రోజ్ ఫౌంటెన్ ఏర్పాటు వెనుక పెద్ద కథాకమామీషే ఉంది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఉండేదట.

చాలా సంవత్సరాల పాటు పోలీస్ స్టేషన్ కొనసాగాక సరైన సదుపాయాలు సమకూరడంలేదని మరొకచోటుకు మార్చారు. దీంతో ఆ ప్రాంతం ఖాళీగా మారిపోయింది. ఒకసారి ఆ దారిలో ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రాంతాన్ని చూసారట.. స్థలాన్ని ఖాళీగా ఎందుకు ఉంచడం.. ఆకర్షణీయంగా మార్చండని అధికారులను ఆదేశించారట.. అలా ఏర్పాటైందే ఇప్పుడు మనం చూస్తున్న ఈ అందమైన రోజ్ ఫౌంటెన్…

సీఎం ఆదేశాల మేరకు గులాబీ పువ్వు ఆకారంలో చూడముచ్చటగా కనిపించే రోజ్ ఫౌంటెన్‌ను, దాంతో పాటు అందమైన పూలమొక్కలతో కూడిన ఉద్యానవనాన్ని రూ.11 లక్షల రూపాయలతో జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. ఈ ఆకర్షణీయమైన రోజ్ ఫౌంటెన్‌ను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, ఉద్యానవన విభాగాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చుట్టూ ఫెన్సింగ్, ఫౌంటెన్, అందమైన ఆకృతుల్లో ఆర్చ్‌‌లు, రకరకాల పూలమొక్కలతో ఇప్పుడు ఈ ప్లేస్‌‌ … ప్రతి ఒక్కరి చూపును తన వైపు తిప్పుకుంటోంది.

ఈ ఫౌంటెన్‌లో పెటోనియా, జింకారోజియా, పెంటాస్, సాల్వియా లాంటి ఎన్నో వెరైటీలను చూడముచ్చటగా నాటారు. రోజ్ ఫౌంటెన్‌లో నీరు గులాబీ రెక్కల మీదుగా కిందకి జాలువారేలా ఏర్పాటు చేయడంతో ఈ ప్లేస్‌‌కే కొత్త కళను తీసుకువచ్చింది. అంతేకాకుండా రాత్రి వేళల్లో మరింత ఆకర్షణీయంగా కనిపించేలా లైట్లను కూడా అమర్చడంతో మరింత హైలెట్‌‌ అవుతోంది.

SHARE