నేల.. నీరు దోపిడీ!

87

The bullet news(atmakur)-  పెన్నా పరివాహక ప్రాంతంలోని పోరంబోకు భూముల్లో ఆక్రమణదారులు యథేచ్ఛగా తిష్ట వేస్తున్నారు. ఒకటి.. కాదు.. రెండు కాదు వందల ఎకరాల్లో కబ్జాదారులు అక్రమంగా సాగు చేస్తూ లక్షలాది రూపాయలను గడిస్తున్నారు. తక్కువ సమయంలోనే రూ. లక్షల సంపాదన వస్తుండడంతో పలువురి కళ్లు పెన్నా పరివాహక ప్రభుత్వ పోరంబోకు భూములపై పడ్డాయి. అడ్డుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లు ఉండడంతో చాలామంది ఈ భాములను తమ సొంత భూముల్లా సాగు చేస్తున్నారు.                                                                                                ఆత్మకూరు మండలంలోని కనుపూరుపల్లి, అప్పారావుపాళెం, కొట్టాలు గ్రామాల సమీపంలోని పెన్నా పోరంబోకు భూముల్లో కొన్ని వందల ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తున్నారు. ఇది కేవలం ఆత్మకూరు మండలంకే పరిమితం కాక సోమశిల నుంచి పెన్నా పరివాహక ప్రాంతాలలోని అన్ని ప్రాంతాలలో చాలావరకు సాగుతోంది. నదికి రెండువైపులా ఆనుకొని ఉండే ఇసుక లేక ఎర్ర ఇసుక నేలలు వేరుశనగ వంటి స్వల్పకాలిక పంటలకు అనుకూలం. ఈ నేలల్లో సాగయ్యే వేరుశనగకు మార్కెట్లో అధిక డిమాండ్‌ ఉంది. దీంతో పలువురు ఈ పోరంబోకు భూముల్లోనే ఈ పంట సాగు చేసేందుకు దిగారు.

ఉచిత విద్యుత్తు వినియోగం
అనధికారికంగా సాగు చేసే పంటలకు ఉచిత విద్యుత్తు ఇవ్వరు. కానీ తమ పొరుగున ఉన్న సొంత భూముల్లో ఉచిత విద్యుత్తు సదుపాయం ఉన్న రైతులకు కాసులు సమర్పించుకుంటూ నది పక్కన సాగు చేసేవారు పంట పండించుకుంటున్నారు. మరికొన్నిచోట్ల విద్యుత్తు లైన్లకు అక్రమ కనెక్షన్లు ఏర్పాటు చేసి విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతూ పెన్నా పరివాహక ప్రాంతంలో పంప్‌సెట్లు అమర్చుకుంటున్నారు. విద్యుత్తు అధికారులకు ఈ వ్యవహారం తెలిసినా చర్యలు లేవు.

చూడనట్లే రెవెన్యూ యంత్రాంగం
పెన్నా పరివాహక ప్రాంతంలో గత సంవత్సరం నుంచి వందలాది ఎకరాలలో అక్రమంగా వేరుశనగ సాగవుతుంటే రెవెన్యూ యంత్రాంగం మాత్రం చూడనట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్పందించడం లేకపోతే పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు మాత్రం అదే ప్రాంతంలో దర్జాగా పంటలు సాగు చేస్తున్నారు.

పెన్నా పరివాహక ప్రభుత్వ భూమిలో అక్రమంగా సాగు చేయడంపై ఆత్మకూరు తహశీల్దారు సుబ్బయ్యను వివరణ అడగ్గా సర్వేయర్‌ ప్రస్తుతం డిప్యూటేషన్‌ మీద చిల్లకూరు మండలంలో విధులు నిర్వర్తిస్తున్నారని, ఆయన రాగానే ప్రభుత్వ భూమి ఎంతవరకు ఉందో కొలతలు తీసుకొని అక్రమంగా సాగు చేసేవారిని తొలగిస్తామని తెలిపారు.

నాయకుల అండదండలతోనే..
ఆత్మకూరు మండలం పెన్నాపరివాహక ప్రాంతంలోని వేల ఎకరాలలో వేరుశనగ పంటను సాగు చేస్తున్నవారందరూ స్థానికేతరులే. వీరు ఏ ప్రాంతంలో భూమిని కబ్జా చేసి సాగు చేసుకోవాలంటే ఆ ప్రాంతంలోని పలుకుబడి ఉన్న రాజకీయనాయకులను ఆశ్రయిస్తున్నారు. ఈ కోవలోనే ఆత్మకూరు మండలానికి చెందిన ఒక రాజకీయనాయకుడు వీరికి తన సహాయం అందిస్తున్నారని సమాచారం. సదరు నేత వల్లనే అటు రెవెన్యూ, విద్యుత్తు శాఖ అధికారులు అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో లక్షల రూపాయలు చేతులు మారినట్టు సమాచారం. దీంతో ఈ సాగుదారులకు గతంలో అధికారులు నోటీసులు జారి చేసినా వీరు వెనక్కు తగ్గలేదు.

చూడని రెవెన్యూ యంత్రాంగం
ఆత్మకూరు మండలంలోని పెన్నా పరివాహక ప్రాంతంలో గత సంవత్సరం నుంచి వందలాది ఎకరాలలో అక్రమంగా వేరుశనగ సాగవుతుంటే రెవెన్యూ యంత్రాంగం మాత్రం చూడనట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్పందించడం లేకపోతే పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు మాత్రం అదే ప్రాంతంలో దర్జాగా పంటలు సాగు చేస్తున్నారు.

SHARE